అచ్చు ఇంటికి వచ్చినట్లే ఉంది: మోదీ
దక్షిణాఫ్రికాకు వస్తే తనకు, తన బృందంలోని అధికారులకు అచ్చం ఇంటికి వచ్చినట్లుగానే ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకుగాను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు రెండూ వలస పాలన, జాతివివక్షలపై పోరాటంలో ఒకే దారిలో ఉన్నాయని ఆయన అన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని.. అక్కడ అధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికార బృందంతో సమావేశమయ్యారు. అనంతరం అధ్యక్షుడు జాకబ్ జుమాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు చేసిన పోరాటం ఫలితంగా రెండు దేశాల మధ్య మంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందన్నారు.
దక్షిణాఫ్రికాలో మైనింగ్, రసాయనాలు, ఔషధ పరిశ్రమలలో వ్యాపార, పెట్టుబడుల బంధాలను మరింత విస్తరించడానికి అవకాశం ఉందని తెలిపారు. తాను దక్షిణాఫ్రికా రావడం వల్ల ఇద్దరు మహానుభావులు.. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా నడిచిన భూమి మీద వారికి నివాళులు అర్పించే మహాభాగ‍్యం కలిగిందని మోదీ చెప్పారు. వృత్తివిద్యారంగంలో భారత దేశానికి ఉన్న సామర్థ్యం రెండు దేశాలకు ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జాకబ్ జుమా, తాను అంగీకారానికి వచ్చామన్నారు. ఇక ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం విషయంలో మద్దతు పలికినందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాఫ్రికా లాంటి మిత్రదేశాల అండ తమకు ఎంతో అవసరమన్నారు. ఇక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోడానికి, విస్తరించుకోడానికి తమ ఇరు దేశాలు అంగీకరించినట్లు జాకబ్ జుమా చెప్పారు.