నేడే భానూదయం.. | NASA Parker Solar Probe Delayed Due To Technical Issue | Sakshi
Sakshi News home page

నేడే భానూదయం..

Published Sun, Aug 12 2018 2:45 AM | Last Updated on Sun, Aug 12 2018 12:57 PM

NASA Parker Solar Probe Delayed Due To Technical Issue - Sakshi

భగభగ మండే సూర్యుడికి అత్యంత సమీపంలోకి పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తలపెట్టిన ‘పార్కర్‌’ శోధక నౌక ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం శనివారం ఈ ప్రయోగం చేపట్టాలి.. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల ఆదివారానికి శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేశారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. దాదాపు రూ.లక్ష కోట్ల ఖర్చుతో చేస్తున్న ఈ ప్రయోగం విషయంలో శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి డెల్టా –4 హెవీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పార్కర్‌ చేరుకుంటుంది. కానీ నేరుగా సూర్యుడి వద్దకు వెళ్లదు. బుధుడి చుట్టూ కనీసం ఏడు చక్కర్లు కొట్టిన తర్వాత 2024 డిసెంబర్‌ 19 నాటికి తొలిసారి సూర్యుడికి అత్యంత సమీపంలోకి అంటే.. కేవలం 40 లక్షల కిలోమీటర్ల దూరానికి చేరుతుంది. దీని ద్వారా దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కొరుకుడు పడని సమస్యలకు సమాధానాలు చెబుతుందని అంచనా.. 

మిస్టరీల పుట్ట.. 
సౌర కుటుంబపు సహజ నక్షత్రం సూర్యుడు ఓ మిస్టరీల పుట్ట. ఉపరితలం కంటే చుట్టూ ఉండే వాతావరణం విపరీతమైన వేడి కలిగి ఉండటం వీటిల్లో ఒక్కటి మాత్రమే. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా అని పిలిచే సూర్యుడి వాతావరణం నుంచి వెలువడే శక్తిమంతమైన కణాలు కొన్నిసార్లు మన ఉపగ్రహ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌ను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు పార్కర్‌ శోధక నౌక ఉపయోగపడుతుందని 
శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. 

ఏముంటాయి దీంట్లో.. 

  • చిన్న సైజు కారులా ఉండే ‘పార్కర్‌’శోధక నౌక సుమారు ఆరేళ్ల పాటు ప్రయాణించి మరీ సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుతుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాలను గుర్తించేందుకు ఓ ఫీల్డ్‌ యాంటెన్నా.. అక్కడి ధూళి కణాలను సేకరించేందుకు ప్రత్యేకమైన ఎస్‌పీసీ పరికరం ఉంటాయి. వీటితో పాటు ఇంధనం సమకూర్చేందుకు సోలార్‌ ప్యానెల్స్, సమాచారాన్ని భూమ్మీదకు పంపేందుకు రేడియో యాంటెన్నా, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించేందుకు మ్యాగ్నెటో మీటర్‌ వంటి పరికరాలూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎల్తైతే.. పార్కర్‌ ముందు భాగంలో ఉండే ఉష్ణ కవచం ఇంకో ఎత్తు. దాదాపు 8 అడుగుల వ్యాసం, నాలుగున్నర అంగుళాల మందమున్న కార్బన్‌ మిశ్రమ లోహంతో ఈ ఉష్ణ కవచం తయారైంది. దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకో గలగడం దీని ప్రత్యేకత. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కవచానికి ఇంకోవైపున ఉండే పరికరాలన్నీ దాదాపు గది ఉష్ణోగ్రతలోనే ఉండటం.. అంటే.. కవచం గుండా ఉష్ణం ఏమాత్రం ప్రసారం కాదన్నమాట. 
  • సూర్యుడి చుట్టూ మూడు చక్కర్లు కొట్టిన తర్వాత పార్కర్‌ సూర్యుడి వ్యాసానికి 9 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 4.3 లక్షల మైళ్లు. 


పేరు వెనుక కథ.. 
2017 వరకూ దీని పేరు సోలార్‌ ప్రోబ్‌ మాత్రమే. ఆ తర్వాత దీని పేరును పార్కర్‌గా మార్చారు. 1958లో సౌర తుపానులను మొట్టమొదట అంచనా వేసిన శాస్త్రవేత్త యుజీన్‌ పార్కర్‌ కృషికి గుర్తిం పుగా ఆయన పేరు పెట్టారు. యుజీన్‌ పార్కర్‌ షికాగో యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. బతికుండగా ఓ శాస్త్రవేత్త పేరు అంతరిక్ష నౌకకు పెట్టడం నాసా చరిత్రలో ఇదే తొలిసారి.  – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement