
ఏడాది తర్వాత నిర్ధిష్ట మార్గం వెంట ప్రయాణిస్తున్న ‘ఓసిరిస్–రెక్స్’
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత అంతరిక్ష నౌక బెన్ను అనే గ్రహశకలం వైపు విజయవంతంగా దూసుకెళ్తోంది. సూర్యుడి చుట్టూ తిరిగే ఈ గ్రహశకలం వైపు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ముందుకు వెళుతోంది. ఈ నౌక వచ్చే ఏడాది నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా వెల్లడించింది. ఓసిరిస్–రెక్స్ అనే ఈ నౌకను ఏడాది కిందే ప్రయోగించినా శుక్రవారమే వేరే గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని అందుకుంది. ఈ నౌక ఏడేళ్లు ప్రయాణించి తిరిగి భూమిని చేరుకుంటుందని, తన ప్రయాణంలో బెన్ను నుంచి నమూనాలను సేకరిస్తుందని నాసా పేర్కొంది.
ఈ ప్రాచీన గ్రహశకలం నమూనాల ద్వారా 450 కోట్ల సంవత్సరాల కింద మన సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందన్న కీలక సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. దీన్ని ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి గతేడాది సెప్టెంబర్ 8న అట్లాస్ వీ 411 రాకెట్ ద్వారా ప్రయోగించారు. రాకెట్ ద్వారా దూసుకువెళ్లే శక్తిని అందించినా, తన కక్ష్యను మార్చుకునేందుకు మరింత శక్తి అవసరం ఉంటుందని నాసా వివరించింది. ఈ అంతరిక్ష నౌకకు చెందిన పరికరాలు మార్గమధ్యంలో భూమిని, చంద్రుడిని కూడా రెండు వారాల పాటు స్కాన్ చేస్తాయని వెల్లడించింది.