చివరి నిద్ర నుంచి మేలుకొన్న ‘న్యూ హారిజాన్స్’
వాషింగ్టన్: మన సౌరకుటుంబం చివరలో ఉన్న ప్లూటో గుట్టును తేల్చేందుకు 9 ఏళ్లుగా యాత్ర సాగిస్తున్న న్యూ హారిజాన్స్ వ్యోమనౌక శనివారం క్రియాశీలం అయింది. వచ్చే జనవరి నుంచే అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఈ వ్యోమనౌక మరుగుజ్జు గ్రహం ప్లూటో దిశగా ప్రయాణం సాగించనుంది. ప్రస్తుతం ప్లూటోకు 26 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న న్యూ హారిజాన్స్ వచ్చే జూలైలో ప్లూటోను చేరుకోనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. భూమికి 290 కోట్ల కి.మీ. దూరంలో ప్రయాణిస్తోన్న ఈ వ్యోమనౌక నుంచి భూమికి రేడియో సంకేతాలు అందేందుకు నాలుగున్నర గంటలు పడుతోందని నాసా తెలిపింది.
2006, జనవరిలో ప్రయోగించిన ఈ వ్యోమనౌక ఇప్పటిదాకా 460 కోట్ల కి.మీ. ప్రయాణించింది. ఇంధన ఆదా కోసం ప్రతి ఆరు నెలలకు ఓసారి క్రియాశీలం అయి తిరిగి నిద్రావస్థలో ఉండేలా ఈ వ్యోమనౌకకు నాసా శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇస్తున్నారు. నిద్రావస్థలో ఉన్నా, వారానికి ఓసారి భూమికి సంకేతాలు పంపేలా కూడా ఆదేశాలు ఇచ్చారు. న్యూక్లియర్ మోటార్ సాయంతో ఇంధన అవసరాన్ని తీర్చుకుంటున్న ఈ వ్యోమనౌక ప్లూటోతో పాటు దాని మూడు ఉపగ్రహాలు, కూపర్‌బెల్ట్ ప్రాంతంలోని మంచు శకలాల సమాచారాన్ని భూమికి పంపనుంది.