
మహా సముద్రం అడుగున 10 రోజులు
వాషింగ్టన్: నలుగురు సభ్యుల బృందాన్ని 10 రోజులపాటు అట్లాంటిక్ మహాసముద్రం అడుగుకు పంపించి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) పరిశోధనలు సాగించనుంది. ఈ పరిశోధన ద్వారా అంతరిక్షంలో అంగారక గ్రహంపై ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేసి, భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలకు సన్నద్ధం కానుంది.
ఈ కార్యక్రమానికి నీమో (నాసా ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్‌మెంట్ మిషన్ ఆపరేషన్స్)–22 అని పేరు పెట్టారు. సముద్రం అడుగున గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుందనీ, అక్కడ ఉంటే దాదాపు అంతరిక్షంలో ఉన్నట్లేనని దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలోలాగే సముద్రం అడుగున నడవడం తదితరాలను బృందంలోని సభ్యులు సాధన చేయనున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష కార్యక్రమాలలో అనుసరించే విధానాలు, సాధనాలను ఇక్కడ పరీక్షించనున్నారు. జూన్ 18న ఈ బృందం సముద్రం అడుగుకు వెళ్తుంది.