ఇంట్లో రోజంతా కరెంటు ఉంటే గొప్ప కాకపోవచ్చు. కానీ...
నెల తిరిగినా బిల్లు రాకపోతే అదీ గొప్ప! బాగానే ఉందిగానీ..
ఇదేమీ అయ్యే పని కాదు అనుకుంటున్నారా? సాధ్యం చేసేస్తున్నారు శాస్త్రవేత్తలు...
కృత్రిమంగా తయారు చేసిన ఆకుల శక్తిని పదింతలు పెంచేశారు!
కృత్రిమ ఆకులేమిటి? వాటి సామర్థ్యం పెంచేయడం ఏమిటి? ఇవేనా మీ ప్రశ్నలు. ఒక్కసారి చిన్నప్పటి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న ‘కిరణజన్య సంయోగక్రియ’ను నెమరేసుకుందాం. మొక్కల ఆకుల్లోని పత్రహరితం సూర్య కిరణాల సాయంతో శక్తిని తయారు చేసుకుంటుందని.. దీన్ని మొక్క పెరుగుదలకు వాడుకుంటుందని మనం చదివే ఉంటాం. ఈ క్రమంలో మనం వదిలేసే కార్బన్‌డయాక్సైడ్ (సీఓ2)ను పీల్చేసుకుని మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అచ్చం ఇదే పద్ధతిలో పనిచేసే కొన్ని పరికరాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని తయారు చేశారుగానీ.. వాటి సామర్థ్యం తక్కువ.. ఖర్చు బోలెడంత ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మినీశ్ సింగ్, చేసిన తాజా పరిశోధనలు.. వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు) పదింతలు ఎక్కువ విద్యుత్‌ను లేదా శక్తిని ఉత్పత్తి చేసేందుకు వినూత్నమైన డిజైన్‌ను సూచిస్తున్నారు. నమూనాలను కూడా రూపొందించి ఈ విషయాన్ని నిరూపించారు కూడా..
సమస్య ఏమిటి?
శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ తయారు చేసిన కృత్రిమ ఆకులు ఒత్తిడితో కూడిన కార్బన్‌డయాక్సైడ్‌ను వాడుకుంటాయి. ఇది వాస్తవ పరిస్థితుల్లో అసాధ్యం. ఎందుకంటే.. గాల్లోంచి వాడుకోవాలంటే.. కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేయాలి.. ఒత్తిడికి గురి చేసి ట్యాంకుల్లో భద్రపరచాలి. ఆ తర్వాతగానీ ఇంధనం తయారు కాదన్నమాట. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. మినీశ్ సింగ్ ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కృత్రిమ ఆకులను నీటితో నిండిన ఓ పెట్టెలో పెట్టడం.. ప్రత్యేకమైన లక్షణాలున్న పదార్థాన్ని కృత్రిమ ఆకు చుట్టూ ఏర్పాటు చేయడం ఇందులో కీలకం. సూర్యరశ్మి తాకిడికి నీరు వేడెక్కి ఆవిరైనప్పుడు అదికాస్తా.. ప్రత్యేక లక్షణాలున్న కవచం గుండా బయటకు వెళ్లిపోతూంటుంది. అదే సమయంలో గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను లోపలికి పీల్చుకునేలా ఈ ప్రత్యేక పదార్థంపై సూక్ష్మస్థాయి రంధ్రాలు ఉంటాయి. కృత్రిమ ఆకుపైన పూసిన పూత కారణంగా కార్బన్‌డయాక్సైడ్ కాస్తా కార్బన్ మోనాక్సైడ్‌గా మారిపోతుంది. కొంత మోతాదులో ఆక్సిజన్ కూడా విడుదల అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల తయారీకి ముడిసరుకుగా పనిచేస్తుందన్నది తెలిసిందే.
గాలినీ శుభ్రం చేస్తాయి..
మినీశ్ సింగ్ బృందం సిద్ధం చేసిన డిజైన్‌తో కొత్త తరం కృత్రిమ ఆకులను వాడటం వల్ల గాలి కూడా శుభ్రమవుతుంది. ఒక్కోటి 1.7 మీటర్ల పొడవు, 0.2 మీటర్ల వెడల్పు ఉండే కొత్త కృత్రిమ ఆకులను 500 చదరపు మీటర్ల వైశాల్యంలో అమర్చి చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్న గాల్లోని కార్బన్‌డయాక్సైడ్ 10 శాతం వరకూ తగ్గిందని రుజువైంది. భవనాల పైకప్పులు మొదలుకొని అన్ని ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆదిత్య ప్రజాపతి అంటున్నారు. దాదాపు 360 కృత్రిమ ఆకులతో ఉత్పత్తి అయ్యే కార్బన్‌మోనాక్సైడ్ 500 కిలోల వరకూ ఉంటుందని.. చౌకైన, అందుబాటులో ఉన్న పదార్థాలతోనే తయారు చేస్తుండటం వల్ల ఇంధన ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆదిత్య చెబుతున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను నిరపాయకరంగా తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment