తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో రెండు రోజులుగా జరిపిన దాడుల్లో 177 మంది మిలిటెంట్లు మరణించారు.
ఇస్లామాబాద్: తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో రెండు రోజులుగా జరిపిన దాడుల్లో 177 మంది మిలిటెంట్లు మరణించారు. వీరిలో చాలా మంది విదేశీయులూ ఉన్నారు. అయితే ఓ బాంబు పేలుడులో ఆరుగురు సైనికులు కూడా చనిపోయారు.
ఇక్కడి షవాల్ ప్రాంతంలోని ఆరు ఉగ్రవాద స్థావరాలపై పాక్ మిలటరీ జెట్లు సోమవారం బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 27 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు సైనికాధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ మరో పది మందిని హతమార్చినట్లు చెప్పారు. ఇక దేగాన్ బోయా ప్రాంతంలో ఆదివారం జరిపిన దాడుల్లో 140 మంది టైస్టులు హతమైనట్లు పాక్ సైన్యం పేర్కొంది.