
ఇస్లామాబాద్: గత సంవత్సర కాలంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను అఫ్గాన్ తాలిబన్లు సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు తాలిబన్ నాయకులు స్థానిక రేడియో చానల్‌లో మాట్లాడినట్లు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. అఫ్గాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి అయిన జల్మే ఖలిల్జాద్ ఇస్లామాబాద్‌లో తాలిబన్ నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ముగ్గురు భారతీయ బందీలను తాలిబన్లు విడుదల చేశారని ఇందుకు ప్రతిగా అఫ్గాన్ జైళ్లలో ఉన్న 11 మంది తాలిబన్ నాయకులను విడుదల చేసినట్లు తెలిపాయి.
అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు అఫ్గాన్ అధ్యక్ష కార్యాలయం, రక్షణ శాఖ నిరాకరించాయి. దీనిపై అఫ్గాన్ ప్రభుత్వం నుంచి గానీ, భారత ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు. విడుదల అయిన బందీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తాలిబన్లు వెల్లడించలేదు. అయితే జైళ్ల నుంచి విడుదలైన తాలిబన్ నేతలను అభినందిస్తున్న ఫొటోలు, వీడియోలను మాత్రం విడుదల చేశారు. కాగా 2018 మేలో బాగ్లాన్ రాష్ట్రంలోని ఓ పవర్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయ ఇంజనీర్లను, వారి డ్రైవర్‌ను తాలిబన్లు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ పని తామే చేశామని అప్పట్లో ఏ గ్రూప్ కూడా ప్రకటించలేదు. అయితే అపహరణకు గురైన ఏడుగురిలో ఒకరిని ఈ మార్చిలో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment