వాయు కాలుష్యంతో రాత్రిళ్లు నిద్రాభంగం!
వాషింగ్టన్: వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలోని వారికి రాత్రి నిద్ర సరిగా ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలుష్య తీవ్రత 60 శాతంగా ఉన్న ప్రాంతాలలోని వారికి రాత్రి నిద్రలో ఆటంకాలు కలుగుతాయని తాజా పరిశోధనలో తేలింది. ‘వాయు కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తులపై భారం పడుతుంది. కానీ మా పరిశోధనల్లో.. వాయు కాలుష్యం నిద్రపై ప్రభావం చూపుతున్నట్లు తేలింద’ని అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ మార్తా వెల్లడించారు.
ఆరుపదుల వయసు దాటిన 1,863 మందిని ఎంపికచేసి, వీరిని 4 గ్రూపులుగా విభజించారు. ఓ మాదిరి కాలుష్య ప్రాంతంలో నివసించేవారిని 3 గ్రూపులుగా, అత్యధిక కాలుష్యానికి గురవుతున్న వారిని నాలుగో గ్రూపులో చేర్చి, వారి మధ్య వ్యత్యాసాలను విశ్లేషించారు. ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నవారు నిద్రలేమితో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి కారణం గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉండడమేనని నిర్ధారించారు.