
భారత్ నుంచి పాక్ కు ముప్పులేదు!
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు, ఉగ్రవాదం, ఇతర అంశాల్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పాక్ అవకాశం కోసం ఎదురుచూస్తు భారత్ మీద దాడులకు పాల్పడుతోంది. అయితే భారత్ వల్ల పాకిస్తాన్ కు ముప్పేమీ లేదని అమెరికా అభిప్రాయపడుతోంది. అప్ఘనిస్తాన్ లో భారత్ నిర్వహిస్తున్న ఆర్థిక చర్యలపై పాక్ ఆందోళన చెందాల్సిన పనిలేదని, దీని వల్ల వారికి ప్రత్యక్షంగా ముప్పేమీ లేదని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
పాక్ ఫ్రస్టేషన్ లో ఉందని, ఆ దేశ అధినేత తమ వైఖరిని మార్చుకుని అప్ఘనిస్తాన్ లో శాంతి కోసం తమతో కలిసి పోరాటం చేయాలని మరోసారి పిలుపునిచ్చింది. అదే విధంగా భారత్ పోషిస్తున్న క్రియా శీలకపాత్రపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నట్లు పాక్ కట్టు కథలు చెప్పడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అప్ఘనిస్తాన్ లో శాంతి కోసం, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు భారత్ 3 బిలియన్ డాలర్లు సాయం చేయడాన్ని అమెరికా కొనియాడింది. దీని వల్ల అక్కడ ఉగ్రవాదం నశిస్తుంది తప్ప, పాక్ కు చెక్ పెట్టడం భారత్ ఉద్దేశం కాదని వైట్ హౌస్ ఆ ప్రకటనలో పేర్కొంది. కానీ ఉగ్రవాదంపై పాక్ పోరాటం చేయకపోతే తమ మద్ధతు కోల్పోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అఫ్ఘాన్ లో భారత్ ఆర్థిక కార్యకలాపాలను మెచ్చుకోవాలని, ఇతర కోణాల్లో చూడటం పాక్ కు శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు.