మార్స్‌పై మీథేన్ వాయువు లేదట!
క్యూరియాసిటీ పరీక్షల్లో వెల్లడి
వాషింగ్టన్: అరుణగ్రహం(మార్స్)పై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న క్యూరియాసిటీ శోధక నౌక(రోవర్) కొత్త సంగతి తేల్చింది. ఆ గ్రహంపై అసలు మీథేన్ వాయువే లేదని వెల్లడించింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకూ క్యూరియాసిటీ ఆరు సార్లు నిర్వహించిన పరీక్షల ఫలితాలను తాము విశ్లేషించగా.. మీథేన్ ఆనవాళ్లేమీ లభించలేదని ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా సూక్ష్మజీవుల జీవక్రియల వల్లే మీథేన్ ఎక్కువగా ఉత్పత్తి అయి వాతావరణంలోకి విడుదల అవుతుంటుంది. అందువల్ల మీథేన్ వాయువు ఉంటే సూక్ష్మజీవుల ఉనికిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే క్యూరియాసిటీకి మార్స్ ఉపరితలంపై మీథేన్ ఆనవాళ్లే లభించకపోవడంతో అక్కడ సూక్ష్మజీవుల ఉనికిపై ఇప్పటిదాకా ఉన్న ఆశలు గల్లంతయ్యాయి. కీలకమైన ఈ పరిశోధనలో యూని వర్సిటీ ఆఫ్ మిచిగన్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సుశీల్ ఆత్రేయ కూడా పాలు పంచుకున్నారు.