మేఘన్ మార్కెల్‌పై తండ్రి ఘాటు వ్యాఖ్యలు | No Option For Prince Harry And Meghan Markle Splitting From Royal Family | Sakshi
Sakshi News home page

మేఘన్‌ రాజ వంశాన్ని చులకన చేసింది

Published Mon, Jan 20 2020 11:08 AM | Last Updated on Mon, Jan 20 2020 11:30 AM

No Option For Prince Harry And Meghan Markle Splitting From Royal Family - Sakshi

సాక్షి, లండన్‌: బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. తమకున్న రాయల్‌ గుర్తింపుని వదులుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందంపై హ్యారీ దంపతులు సంతకాలు చేశారు. ఇకపై వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అంతేకాదు బ్రిటన్‌ రాజ కుటుంబం వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకుగాను పన్ను రూపంలో బ్రిటన్‌ వాసులు చెల్లించే ఆదాయం కూడా ఇకపై వారికి అందదు. కొద్ది రోజుల క్రితమే హ్యారీ దంపతులు రాయల్‌ ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లనున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియకు బ్రెగ్జిట్‌ను తలపించేలా మెగ్జిట్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. ‘హ్యారీ, మేఘన ఇక రాయల్‌ కుటుంబ సభ్యులు కాదు. వారి పేర్లకు ముందు గౌరవసూచకంగా వాడే టైటిల్స్‌ను (హెచ్‌ఆర్‌హెచ్‌) ఇకపై వాడకూడదు’’ అని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

చదవండి: ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ ఉండే బంగ్లా ఇదే!

నెలల తరబడి నిర్మాణాత్మకంగా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్‌  చెప్పారు. హ్యారీ, మేఘన్, వారి ముద్దుబిడ్డ ఆర్కీని రాజ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారని 93 ఏళ్ల వయసున్న రాణి తన వ్యక్తిగత ప్రకటనలో తెలిపారు. తన మనవడు, మనవరాలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. హ్యారీ కుటుంబం ఇకపై కెనడాలో నివసించనుంది. అయితే అప్పుడప్పుడు బ్రిటన్‌లో కూడా కాలం గడుపుతారు. అందుకోసం హ్యారీ ఫ్రాగ్‌మోర్‌ కాటేజీని తన వద్దే ఉంచుకున్నారు. ఈ కాటేజీని తన సొంతానికి వినియోగించుకుంటున్నందుకు 24 లక్షల పౌండ్లు చెల్లించాలని హ్యారీ నిర్ణయించారు.

చదవండి: ‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’
  
మేఘన్‌కు రాణి ప్రత్యేక సందేశం 
మేఘన్‌ మార్కెల్‌కు రాణి ఎలిజబెత్‌ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘మేఘన్‌ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత త్వరగా ఆమె ఒక ఇంటిదైంది. ఈ రోజు జరిగిన ఒప్పందంతో ఆమె కొత్త జీవితం మరింత  సంతోషంగా, శాంతిగా ముందుకు సాగాలని మా కుటుంబం ఆకాంక్షిస్తోంది’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. మిలటరీ అపాయింట్‌మెంట్లు సహా రాజకుటుంబం నిర్వర్తించే విధుల నుంచి కూడా వారిద్దరూ తప్పుకున్నట్టు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ధ్రువీకరించింది. ఈ పరిణామాన్ని దిగమింగుకోవడం భరించలేని కష్టంగా ఉందంటూ రాజకుటుంబం అభిమానులు పెద్ద సంఖ్యలో పోస్టులు పెట్టారు.  

మేఘన్ మార్కెల్‌ తండ్రి థామస్ మార్కెల్‌ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ
బ్రిటిష్ రాజ వంశాన్ని తమ కుమార్తె చాలా చులకన చేసిందని మేఘన్ మార్కెల్‌ తండ్రి థామస్ మార‍్కెల్‌ ఆరోపించారు.  తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కుమార్తె ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ప్రిన్స్ హారీ, ఆయన సతీమణి మేఘన్ ఇకపై రాజ వంశ సభ్యులుగా వ్యవహరించబోరని బకింగ్ హాం ప్యాలెస్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు తమ జీవితాలను తమదైన రీతిలో జీవిస్తారని కూడా తెలిపింది. తాము రాజ వంశానికి సంబంధించిన విధులను తగ్గించుకుంటామని ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్‌ దంపతులు గత నెలలో ప్రకటించారు. దీంతో క్వీన్ ఎలిజబెత్, ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు చర్చలు జరిపి, ఈ నిర్ణయం తీసుకున్నారు.

చదవండి: తప్పంతా మేఘన్‌ మీదకు నెడుతున్నారు..

ఈ నేపథ్యంలో థామస్‌ను ఓ ఛానల్  ఇంటర్వ్యూలో.. ప్రతి అమ్మాయి యువరాణి కావాలని కోరుకుంటుందని థామస్ చెప్పారు. అలాంటి కల తన కుమార్తె మేఘన్‌కు సాకారమైందన్నారు. అటువంటి దానిని ఆమె వదులుకుంది. ఈ పరిణామం చాలా నిరాశ కలిగిస్తోందన్నారు. ఆమె డబ్బు కోసమే ఈ విధంగా చేసినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్రిటిష్ రాజ వంశం సుదీర్ఘ కాలం మనగలుగుతున్న గొప్ప వ్యవస్థల్లో ఒకటని ఆయన అన్నారు. 2018లో హారీని మేఘన్ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి, ఆ దంపతులు రాజ వంశంలో భాగమని.. వారు రాజ వంశానికి ప్రాతినిథ్యం వహించవలసి ఉంటుందని చెప్పారు. అటువంటి రాజ వంశాన్ని వీరిద్దరూ చులకన చేశారని, అగౌరవపరిచారని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement