
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఛైర్మన్, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు ధిక్కరణ నేరం కింద పాక్ ఎన్నికల కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. కేసు విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో పాటు దీనిపై లిఖితపూర్వక క్షమాపణలు తెలుపనందుకు ఈసీ చర్యలు చేపట్టింది. పార్టీ అసంతృప్త నేత అక్బర్ ఎస్ బాబర్ దాఖలు చేసిన కేసు తదుపరి విచారణకు అక్టోబర్ 26న ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఈసీ ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని పాక్ తెహ్రీక్ ఇన్సాఫ్ ప్రతినిధి నీముల్ హక్ పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి గతంలో కోర్టు ఇమ్రాన్‌కు బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అంతకుముందు పలుమార్లు విచారణకు హాజరు కావాలని పలు మార్లు నోటీసులు పంపింది. అయితే తనపై కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీకి ఉన్న చట్ట పరిధిలో ఉన్న అధికారాలపై ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించే అధికారం తమకు ఉందని ఆగస్టు 10న పాక్ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.