
వాషింగ్టన్ : సాధారణంగా ఆస్పత్రులలో పేషెంట్లకు వైద్య సిబ్బంది ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా మెడిసిన ఇచ్చి వారి అనారోగ్యాన్ని దూరం చేసేందుకు చూస్తారు. అయితే అమెరికాలోని కూక్ విల్లేలో పేషెంట్ విషయంలో నర్స్ చూపిన ప్రేమ, ఆత్మీయతతో ఆమె అందరి మనసుల్ని ద్రవింపచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తల్లి చివరిక్షణాలు ఎంతో హాయిగా గడిచేలా చూసిన నర్స్ కు అందంతో పాటు అందమైన మనసు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మార్గరెట్ స్మిత్ అనే పెద్దావిడ గత కొంతకాలం నుంచి కాలేయ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. గతవారం మార్గరెట్ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఆమెను కుటుంబసభ్యులు వండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. అయితే రెండు రోజుల్లోనే ఆమె చనిపోయింది. కానీ ఆస్పత్రిలో తన తల్లిని కన్నకూతురి కంటే ఎక్కువగా ఓ నర్స్ ఓలివియా న్యూఫెల్డర్ చూసుకున్నారని మేగన్ స్మిత్ ఓ వీడియోతో పాటు సందేశాన్ని ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
తన సపర్యలు చేసిన నర్స్ ఓలివియాను ముద్దుగా ఏంజెల్ అని పెద్దావిడ మార్గరెట్ పిలుచుకునేవారు. కొన్ని గంటల్లోనే తాను చనిపోతానని భావించిన మార్గరెట్.. తన ఏంజెల్‌ను ఫెవరెట్ సాంగ్ పాడమని అడిగారు. 'డ్యాన్సింగ్ ఇన్ ద స్కై' అనే పాటను నర్స్ పాడుతుండగా పేషెంట్ మార్గరెట్ స్వరం కలిపారు. ఆ సమయంలో మరో నర్స్ పెద్దావిడకు ఇంజెక్షన్ ఇస్తున్నా.. ఆ బాధమీ లేదన్నట్లుగా తన తల్లి పాట పాడుతూ చివరి క్షణాలను ఆస్వాదించారని ఆ పోస్ట్‌లో మేగన్ పేర్కొన్నారు. పెద్దావిడ కోసం 'ఎంజెల్' నర్స్ పాట పాడుతూ కన్నీళ్లు కార్చడం వీక్షకుల మనసులను ద్రవింపచేస్తుంది. ఏం ఇచ్చినా ఆ నర్స్ తన తల్లిపై చూపిన ప్రేమకు సరితూగదని మేగన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment