
మా యుద్ధం ఇస్లాంపై కాదు: ఒబామా
వాషింగ్టన్: తాము ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని, ఆ మతాన్ని వక్రమార్గం పట్టించి హింసకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపైనే పోరాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఓడించేందుకు పాశ్చాత్య దేశాలు, ముస్లిం మతపెద్దలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం మతానికి తామే ప్రతినిధులమంటున్న ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు చేయిచేయి కలపాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద నిర్మూలనపై తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన ఓ సదస్సులో ఒబామా మాట్లాడారు. దారి తప్పి న సిద్ధాంతాలను వంద కోట్ల మంది ముస్లింలు తిరస్కరిస్తున్నారన్న సంగతిని అల్‌కాయిదా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు గుర్తిం చడం లేదన్నారు. ‘‘అల్‌కాయిదా, ఐఎస్‌ఐఎల్ వంటి ఉగ్రవాద సంస్థ లు ఇస్లాంను అడ్డుపెట్టుకొని తమను తాము మత ప్రతినిధులుగా, పవిత్ర యుద్ధం చేస్తున్నవారిగా ప్రకటించుకుంటున్నాయి. తనను తాను ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకుంటున్న ఐఎస్, అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇస్లాంతో యుద్ధం చేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తోంది. పాశ్చాత్య దేశాలు ముస్లింకు వ్యతిరేకం అన్న తప్పుడు భావనను ప్రపంచ దేశాలు, ముస్లిం సమాజం తిరస్కరించాలి’’ అని ఒబామా అన్నారు. ఈ సదస్సులో భారత్‌తోపాటు 60 దేశాల నేతలు పాల్గొన్నారు.
కౌంటర్ టైజం ప్రతినిధిగా ఇండో అమెరికన్
అమెరికా వ్యూహాత్మక ఉగ్రవాద నిరోధక సమాచార కేంద్రం ప్రత్యేక ప్రతినిధి, సమన్వయకర్తగా భారతీయ-అమెరికన్ రషద్ హుస్సేన్ (37) నియమితులయ్యారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగస్వామ్య దేశాలతో కలసి అమెరికా పోషిస్తున్న పాత్రను విస్తరించడంలో దోహదపడేందుకు హుస్సేన్‌ను నియమించినట్లు విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఇస్లామిక్ దేశాల సంస్థ (ఓఐసీ) ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు.