వాషింగ్టన్: అమెరికాలో భారతీయులు సహా రెండు లక్షల మందికిపైగా హెచ్1బీ వీసాదారుల పరిస్థితి ఈ జూన్ నాటికి అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసిన తరువాత నిబంధనల కారణంగా అమెరికాలో ఉండకూడని పరిస్థితి ఒకవైపు అయితే, అంతర్జాతీయ ప్రయాణాలపై భారత్ నిషేధాన్ని కొనసాగిస్తే స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి మరోవైపు ఉండనుంది. జూన్ చివరి నాటికి వీసా గడువు ముగియనున్న వారిలో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు దాదాపు 2.5 లక్షలమంది ఉన్నారు.
వారిలో సుమారు 2 లక్షల మంది హెచ్1బీపైననే అక్కడ ఉన్నారు. వీరే కాకుండా గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకోని, జూన్‌లోపు వీసా గడువు ముగిసే హెచ్1బీ వీసాదారులు కూడా వేలల్లో ఉన్నారని, వారంతా కూడా స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు జెరెమి న్యూఫెల్డ్ తెలిపారు. కోవిడ్–19 కారణంగా గత రెండు నెలల్లో లక్షలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, స్థానిక అమెరికన్ల పరిస్థితికి, వీసా నిబంధనలకు లోబడి ఆ దేశంలో ఉండాల్సి వచ్చే విదేశీయుల పరిస్థితికి చాలా తేడా ఉంటుంది.
ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులు ఆ తరువాత 60 రోజుల్లోగా వేరే జాబ్ వెతుక్కుని, వీసా స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. లేదా స్వదేశానికి తిరిగివెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు, ఉద్యోగాలు కోల్పోని వారి సందిగ్ధత మరోలా ఉంది. ఉద్యోగం ఉన్నప్పటికీ.. ఈ సంక్షోభ సమయంలో ఒకవేళ వీసాలు రెన్యువల్ కానట్లయితే.. ఏం చేయాలనే సందిగ్ధతలో వారున్నారు. ‘ఈ వీసా సంక్షోభం ఉద్యోగాల విషయంలోనే కాకుండా, ఆర్థికంగానూ పెనుముప్పుగా పరిణమించింది. హెచ్1బీ వీసాదారులకు, వారి ఉద్యోగాలపైననే ఆధారపడి, అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న కుటుంబ సభ్యులు ఉంటారు. అక్కడే చదువుకుంటున్న పిల్లలుంటారు.
ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరం’అని బౌండ్‌లెస్ ఇమిగ్రేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, ఒబామా హయాంలో అమెరికా ఇమిగ్రేషన్ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన డౌ ర్యాండ్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభ సమయంలో వీసా గడువు ముగుస్తున్న విదేశీ ఉద్యోగులకు సెప్టెంబర్ 10 వరకు వారి వీసా గడువు పొడిగించాలని కోరుతూ అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు సభ్యులుగా ఉన్న టెక్‌నెట్ అనే లాబీయింగ్ గ్రూప్ అమెరికా విదేశాంగ శాఖకు ఇటీవల ఒక లేఖ రాసింది. అప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో హెచ్1బీ వీసాపై ఉన్న టెక్కీల సేవలు ఆరోగ్య రంగం సహా అన్ని రంగాలకు అత్యవసరమని పేర్కొంది. ట్రంప్ సర్కారు వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2015లో 1.09 కోట్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ కాగా, 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 87 లక్షలకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment