ఆదేశం.. భారత్ ను మించిపోయింది!
న్యూఢిల్లీః ప్రతివిషయంలో భారత్ తో పోల్చుకొని, అన్నింటా తానే ముందుండాలని ప్రయత్నించే పాకిస్తాన్.. నల్లడబ్బు విషయంలో ఇండియాను మించిపోయిందట. స్విస్ బ్యాంకుల్లో పదివేల కోట్ల వరకూ ఆదేశం నల్లధనం దాచినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది.
ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ నల్లధనం దాచడంలో ముందు స్థానంలో ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 లెక్కలతో పోలిస్తే పాకిస్తాన్ స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీ 16 శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదికల్లో వెల్లడించింది. పాకిస్తాన్ నల్లధనం విలువ పెరగడం వరుసగా ఇది రెండోసారని నివేదికలో తెలిపింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ ఎన్ బి) వెల్లడించిన వివరాలను బట్టి, 2014 లో పాకిస్తాన్ కరెన్సీ సీహెచ్ఎఫ్ 1,301 మిలియన్లుగా ఉన్న నల్లధనం, 2015 పూర్తయ్యేనాటికి 16 శాతం పెరిగి సిహెచ్ ఎఫ్ 1,513 మిలియన్లకు చేరినట్లు తెలిపింది. అయితే భారత్ విషయంలో ఆ విలువలు 33 శాతం పడిపోయి, 2015 చివరికి రూ. 8,392 కోట్ల రూపాయలకు చేరినట్లు ఎస్ ఎన్ బి వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.