కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన శిలాఫలకం వద్ద పాక్ ప్రధాని ఇమ్రాన్, భారత మంత్రులు హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, హర్‌దీప్‌సింగ్, సిద్ధూ
కర్తార్‌పూర్: సిక్కు యాత్రికుల సౌలభ్యం కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో బుధవారం శంకుస్థాసన చేశారు. పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని చెప్పారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలనూ ఇరు దేశాల నాయకత్వాలు బలం, కృషితో పరిష్కరించుకోవచ్చన్నారు. ‘దేవుడు తమకు ఇచ్చిన అవకాశాలను భారత్, పాక్‌లు అర్థం చేసుకోవడం లేదు.
నేను ఎప్పుడైనా భారత్‌కు వెళ్తే.. పాక్‌లోని రాజకీయ నేతలు భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నా పాక్ సైన్యం మాత్రం అలా జరగనివ్వదని నాకు చెబుతుంటారు. కానీ సైన్యంతో సహా మేమంతా భారత్‌తో సుహృద్భావాన్నే కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నా’ అని ఇమ్రాన్ అన్నారు. ఒకప్పుడు భీకర యుద్ధాలు చేసుకున్న ఫ్రాన్స్, జర్మనీలే ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో సత్సంబంధాలను కలిగి ఉన్నాయనీ, భారత్–పాక్ మధ్య కూడా శాంతి, మంచి సంబంధాలు సాధ్యమేన న్నారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారను, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారను కలుపుతూ నాలుగు కిలో మీటర్ల రహదారిని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాక్‌లు కలిసి నిర్మిస్తుండటం తెలిసిందే. ఇందుకోసం భారత్‌లో సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్ ఆ పనిని బుధవారం ప్రారంభించింది. శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, హర్‌దీప్‌సింగ్ పురీ హాజరయ్యారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వద్దని సూచించినా వినకుండా ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం తెలిసిందే.
‘వీసా’పై నిర్ణయం తీసుకోవాలి: సుష్మ
కర్తార్‌పూర్ కారిడార్‌లో ప్రయాణించే సిక్కు యత్రికులకు వీసా అవసరం ఉండదని వార్తలు వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాటలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. యాత్రికులకు వీసా అవసరమో కాదో ఇంకా నిర్ణయించాల్సి ఉంద న్నారు. హైదరాబాద్‌లో సుష్మ మాట్లాడుతూ ఈ కారిడార్‌కు, పాక్‌తో చర్చలకు సంబంధం లేదని పేర్కొన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన సభలో ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పుబట్టింది.
దైవకార్యాన్ని ఇమ్రాన్ రాజకీయాలకు ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. కాగా, పలువురు ఖలిస్తాన్ విభజన వాద సిక్కులు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ ఖలిస్తాన్ నేత గోపాల్ దాస్.. పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాతో కరచాలనం కూడా చేశారు. అయితే గోపాల్ దాస్ పాకిస్తాన్‌లోని గురుద్వారల కమిటీలో సీనియర్ నేత అనీ, అన్ని సిక్కు మతపరమైన కార్యక్రమాలకూ ఆయనను ఆహ్వానిస్తారని ఓ అధికారి చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్యులందరితోనూ ఆర్మీ చీఫ్ కరచానలం చేశారనీ, భారత మీడియా ఈ అంశాన్ని భూతద్దంలో చూస్తోందన్నారు.
సిద్ధూ పాక్‌లోనూ గెలవగలడు
ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్న సిద్ధూపై భారత్‌లో ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్‌లో కూడా సిద్ధూ ఎంతో ప్రాచుర్యం పొందాడనీ, ఆ దేశంలోని పంజాబ్‌లో ఎన్నికల్లో నిలబడినా అతను గెలుస్తాడని ఖాన్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు సిద్ధూ భారత ప్రధాని అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిన అవసరం రాదనే తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కర్తార్‌పూర్ కారిడార్ కార్యరూపం దాల్చడానికి మీరే కారణమంటే మీరే కారణమంటూ ఇమ్రాన్ ఖాన్, సిద్ధూలు గతంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా సిద్ధూ హాజరైనప్పుడు కర్తార్‌పూర్ కారిడార్ గురించి ఖాన్‌తో ఆయన మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. సీఎం సలహాను పెడచెవిన పెట్టి తన వ్యక్తిగత పర్యటన అంటూ పాక్‌కు వెళ్లిన సిద్ధూపై పంజాబ్‌లో ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్, బీజేపీ విమర్శలు గుప్పించాయి.
ఇదీ కర్తార్‌పూర్ చరిత్ర
1522: సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తొలి గురుద్వారాను కర్తార్‌పూర్‌లో ఏర్పాటుచేశారు. మరణించేంత వరకు, 18 ఏళ్లపాటు ఆయన అక్కడే బోధనలు చేస్తూ కాలం గడిపారు.
1999: ప్రధాని వాజ్‌పేయి శాంతి ప్రయత్నాల్లో భాగం గా పాక్‌కు బస్సులో వెళ్లినప్పుడు ఈ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదించారు.
2000: భారత్ వైపు నుంచి ఓ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా భారత్‌లోని సిక్కులు వీసా, పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించేలా అనుమతించేందుకు పాక్ అంగీకారం.
2018 ఆగస్టు: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరుస్తామని పాక్ ఆర్మీ చీఫ్ తనకు చెప్పినట్లు వెల్లడి.
నవంబర్ 22: కర్తార్‌పూర్ కారిడార్‌లో భాగంగా డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.
నవంబర్ 26: భారత్‌వైపు కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శంకుస్థాపన.
నవంబర్ 28: పాకిస్తాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.
Comments
Please login to add a commentAdd a comment