
ఆ కళాకారులపై నిషేధం తగదు..
పాకిస్థానీ కళాకారులకు భారత్ లో బ్యాన్ విధించడాన్ని రాధికా ఆప్టే వ్యతిరేకించారు.
ముంబైః సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ సినిమాలో మెరిసిన రాధికా ఆప్టే.. ముంబైలో జరిగిన స్వాచ్ వాచెస్ కార్యక్రమంలో పాల్తొన్నారు. ఈ సందర్శంగా మాట్లాడిన ఆమె.. ముందుగా తీవ్రవాదాన్ని ఖండిస్తూ, భారత సైనికులకు తన సంఘీభావం తెలిపారు. మరోవైపు పాకిస్థానీ కళాకారులపై బ్యాన్ విధించడం తగదంటూ తన మనసులో మాటను వెల్లడించారు.
ఉడీ, బారాముల్లాల్లో ఉగ్రదాడులు దేశంలో బీభత్సాన్ని సృష్టించి, తీవ్రమైన విషాదాన్ని, విచారాన్ని మిగిల్చాయని రాధికా ఆప్టే అన్నారు. దాడుల్లో సైనికులు మరణించడంపై ఆమె.. తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలో పాకిస్థానీ కళాకారులకు భారత్ లో బ్యాన్ విధించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఉగ్రదాడులకు కళాకారులకు ముడి పెట్టడం సరికాదన్న ఆమె... ఒకవేళ స్వాచ్ వాచెస్ ను ఇండియాలో అనుమతిస్తే.. పాకిస్థానీ కళాకారులను కూడా అనుమతించాల్సి ఉంటుందని ఆప్టే తన అభిప్రాన్ని తెలియజేశారు.
ఉడీ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులు ఫవాద్, మహీరా ఖాన్ వంటివారు దేశం విడిచి వెళ్ళిపోవాలని, వారు నటించిన సినిమాలను అడ్డుకోవాలని మహరాష్ట్ర నవ నిర్మాణ్ సేస నుంచి డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఓం పురి, సోనాలీ బింద్రే తదితర ప్రముఖ తారలెందరో నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థానీ కళాకారులకు అనుకూలంగా మాట్టాడారు. కళాకారులపై నిషేధం విధించినంత మాత్రాన తీవ్రవాదాన్ని అడ్డుకోగలరా అంటూ ప్రశ్నించారు. కళాకారులంతా ప్రభుత్వం ఇచ్చిన వీసాల ద్వారానే ఇక్కడకు వచ్చారని, వారు తీవ్రవాదులు కాదని అన్నారు. ఇదే మార్గంలో రాధికా అప్టే కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే ప్రముఖ వెటరన్ యాక్టర్ నానా పటేకర్ మాత్రం.. దేశంముందు కళాకారులు నల్లుల్లాంటి వారని, దేశ భద్రతను కాపాడే సైనికుల తర్వాతే ఎవరైనా అని కళాకారులనుద్దేశించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన అన్నింటికన్నా దేశమే నాకు ముందన్న ఆయన.. పాకిస్థానీ కళాకారులకు అనుకూలంగా మాట్లాడిన సల్మాన్ వంటి వారి వ్యాఖ్యలను కూడా పరోక్షంగా విమర్శించారు.