దుబాయ్ : ఓ భారత విద్యార్థినికి పాకిస్తాన్ టాక్సీ డ్రైవర్ సాయం చేశాడు. ఆమె పోగొట్టుకున్న వాలెట్‌ను తిరిగి ఇచ్చి.. ఇబ్బంది పడకుండా ఆదుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాచెల్ రోజ్ విద్యార్థిని కుటుంబం దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే డిగ్రీ పూర్తిచేసిన రోజ్.. ప్రస్తుతం యూకేలోని లాంకాస్టర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల హాలీడే కోసం దుబాయ్ వచ్చిన రోజ్.. అక్కడ ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు.
జనవరి 4వ తేదీన బుర్జుమాన్ దగ్గర్లో సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో రోజ్ ఫ్రెండ్‌తో కలిసి పాకిస్తాన్‌కు చెందిన ఖాదీమ్ టాక్సీ ఎక్కారు. అయితే అదే సమయంలో మరో కారులో వారి స్నేహితులు ఉండటం చూసిన రోజ్.. వెంటనే కారులో నుంచి దిగిపోయారు. వారి వద్దకు వెళ్లే తొందరలో తన వాలెట్‌ను ట్యాక్సీలో మరిచిపోయారు. రోజ్ వాలెట్‌లో ఎమిరేట్స్ ఐడీ, యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, క్రెడిట్ కార్డు, కొంత మొత్తంలో డబ్బులు కూడా ఉన్నాయి.
ఆ తర్వాత తన వాలెట్ పోగొట్టుకున్న సంగతి గుర్తించిన రోజ్ ఆందోళన చెందారు. తిరిగి యూకేకు వెళ్లే సమయం దగ్గర పడటంతో (జనవరి 8) ఆమె ఒత్తిడికి లోనయ్యారు. అంతేకాకుండా 13న ముఖ్యమైన పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే రోజ్ వద్ద కనీసం వీసాకు సంబంధించిన కాపీ కూడా లేకపోవడంతో ఆమె యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అధికారులు మాత్రం.. తిరిగి వీసాకు దరఖస్తు చేసుకోవాల్సిందిగా రోజ్‌కు సూచించారు. దీంతో రోజ్ తన వాలెట్ కోసం పోలీసులను ఆశ్రయించారు. రోజ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె కారు ఎక్కిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. అయితే రోజ్ ఎక్కిన కారు నెంబర్‌ను మాత్రం సరిగా గుర్తించలేకపోయారు. రోజ్ కారు ఎక్కి.. వెంటనే దిగిపోవడంతో డ్రైవర్ మీటర్‌ను స్టార్ట్ చేయలేదు. దీంతో ఆర్టీఏ కాల్ సెంటర్ ద్వారా డ్రైవర్ ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఆమె వాలెట్‌ను గుర్తించడం కష్టంగా మారింది.
మరోవైపు రోజ్ దిగిపోయిన తరువాత ఖాదీమ్ రెండు ట్రిప్పులు పూర్తి చేశాడు. ఆ తర్వాత కారులో వాలెట్‌ను గుర్తించిన అతడు.. దానిని ఓపెన్ చేసి చూశాడు. కానీ అందులో రోజ్‌ను సంప్రదించడానికి అవసరమైన ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆర్టీఏ కాల్‌సెంటర్‌కు కాల్ చేసిన ఖాదీమ్.. తనకు లభించిన వాలెట్‌లోని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆమె అడ్రస్ కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో అది సాధ్యపడలేదు. ఇందుకోసం ఇతర విభాగం అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాలని భావించాడు. కానీ మరో ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సూచన మేరకు ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాడు. అయితే అవన్నీ విఫలం అయ్యాయి.
చివరకు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆర్టీఏ కాల్ సెంటర్ నుంచి ఖాదీమ్‌కు ఫోన్ వచ్చింది. అతడు చెప్పిన వివరాలు.. తమకు వచ్చిన ఫిర్యాదుకు సరిపోలడంతో ఆర్టీఏ కాల్ సెంటర్ అధికారులు అతనికి రోజ్ అడ్రస్ చెప్పారు. దీంతో ఖాదీమ్ వాలెట్‌ను రోజ్‌కు అందజేశాడు. తన కుమార్తె వాలెట్ తిరిగి లభించడంతో ఆనందంతో రోజ్ తండ్రి ఖాదీమ్‌కు 600 దినార్లు ఇవ్వగా తిరస్కరించాడు. రోజ్‌ను సోదరిగా భావించి ఆ డబ్బును తీసుకోలేదని ఖాదీమ్ తెలిపారు. అయితే రోజ్ కుటుంబం ఖాదీమ్‌ను అభినందిస్తూ.. ఆర్టీఏకు లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment