
పాకిస్తాన్ హిందువులకు నజరానా
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న హిందువులకు అధికారులు నజరానా ప్రకటించారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న హిందువులకు అధికారులు నజరానా ప్రకటించారు. తమకు దేవాలయం, కమ్యూనిటీ కేంద్రం, శ్మశాన వాటికలను నిర్మించాలన్న హిందువుల డిమాండ్లను నెరవేర్చేందుకు ఇస్లామాబాద్‌లోని రాజధాని అభివృద్ధి సంస్థ (సీడీఏ) అధికారులు అంగీకరించారు.
సెక్టార్ హెచ్9లో అర ఎకరం స్థలాన్ని హిందూ దేవాలయం, కమ్యూనిటీ కేంద్రం, శ్మశాన వాటిక కోసం కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ దినపత్రిక వెల్లడించింది. బౌద్ధులకు కేటాయించిన స్థలంకు సమీపంలోనే హిందువులకు స్థలం ఇచ్చారని తెలిపింది. ఇస్లామాబాద్‌లో 800 మంది హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. హిందువులు ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరిందని ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ పేర్కొంది.