ప్రేమజంట కోసం జర్నలిస్టు బలి
కరాచీ: యువతి కుటుంబసభ్యుల అనుమతి లేకుండా, ప్రియుడితో ఆమె ప్రేమవివాహాన్ని సమర్థించిన ఓ జర్నలిస్టును వధువు బంధువులు కాల్చిచంపారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది.
యువతి తన కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగా, అజ్మల్ జోయియా (30) అనే జర్నలిస్టు ప్రేమజంటకు అండగా నిలిచి, వారికి రక్షణ కల్పించాల్సిందిగా జిల్లా అధికారులను కోరినట్టు పోలీసులు చెప్పారు. దీంతో యువతి కుటుంబసభ్యులు అజ్మల్ను టార్గెట్ చేసినట్టు తెలిపారు. లోద్రాన్ జిల్లాలో అజ్మల్ బైకుపై ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు సాయుధులు ఆయనను హత్యచేశారు. ఆయనతో పాటు బైకులో కూర్చుని వెళ్తున్న బంధువు ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. అజ్మల్ హత్యను ఖండిస్తూ పంజాబ్ ప్రావిన్స్లో జర్నలిస్టు నిరసన ప్రదర్శనలు నిర్వహించి, హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేసి, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇష్టంలేకుండా ప్రేమ వివాహం చేసుకున్న యువతులను చంపడం పాకిస్తాన్లో సర్వసాధారణం. ఒక్కోసారి ప్రేమజంటలకు మద్దతు ఇచ్చిన వారిని కూడా టార్గెట్ చేస్తుంటారు.