పోర్క్ పెడతారా అంటూ.. నిరాహారదీక్ష
పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి జపాన్‌లో గత రెండు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. యొకొహామా ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో తనకు పంది మాంసం (పోర్క్) పెట్టినందుకు నిరసనగా అతడు దీక్ష చేస్తున్నాడు. ఎందుకో తెలియదు గానీ, అతడిని జపాన్ అధికారులు నిర్బంధించారు. ఆగస్టు మూడో తేదీ సాయంత్రం అతడికి భోజనం పెట్టారు. అందులో ప్రాసెస్ చేసిన పందిమాంసం కూడా ఉందని అతడు అంటున్నాడు. తమ మతాచారాల ప్రకారం పంది మాంసం తినబోమని, అయినా అదే పెట్టారని చెప్పాడు. దాంతో ఆ రోజు నుంచి అతడు దీక్షలో ఉన్నాడు. గత రెండు వారాలుగా అతడు కేవలం మంచినీళ్లు, పోషకాహార సప్లిమెంట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగానే ఉందని జపాన్ అధికారులు అంటున్నారు.
ఇంతకుముందు 2015లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. యొకొహామా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఓ ముస్లిం వ్యక్తికి పంది మాంసం ముక్కలతో కూడిన సలాడ్ పెపట్టారు. తర్వాత అది పొరపాటున జరిగిందంటూ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ విదేశీయుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే మానవహక్కుల బృందం ఒకటి ఇమ్మిగ్రేషన్ శాఖను కోరింది. ప్రజల మత విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని భోజనాలు పెట్టాలని, మరోసారి ఇలా జరగకూడదని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు.