
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొత్త పార్టీ పెట్టేందుకు చేస్తున్న అతడి ప్రయత్నాలకు గండికొట్టింది. ఎట్టి పరిస్థితుల్లో హపీజ్ సయీద్ పార్టీకి గుర్తింపును ఇవ్వొద్దంటూ పాక్ ఎన్నికల కమిషన్‌ను పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరింది. జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు అయిన హఫీజ్‌పై పలు నేరాలు చేసిన కేసులు ఉన్నాయి. ఎన్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ముఖ్యంగా భారత్‌లో జరిగే చొరబాట్లకు, సీమాంతర ఉగ్రవాదంలో హఫీజ్ సయీద్ పాత్ర కీలకం అని కూడా తెలిసింది.
ఐక్యరాజ్యసమితి కూడా హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తించడంతో ఇటీవలె పాకిస్థాన్ అతడిని గృహనిర్భందం చేయడంతోపాటు అతడి అనుచరులను ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానంటూ సయీద్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక ఉగ్రవాది పార్టీ పెడతానంటే పాక్ ఏం చేస్తోందంటూ పలు చోట్ల విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ స్పష్టం చేసింది.