ఐఎస్ఐ చీఫ్ మార్పు..?
ఇస్లామాబాద్: త్వరలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ స్థానంలో మరొకరిని నియమించనున్నట్లు సమాచారం. మార్పు ప్రక్రియ జరుగుతున్నట్లు శనివారం ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 2014 సెప్టెంబర్‌లో ఐఎస్‌ఐ డీజీగా అక్తర్ బాధ్యతలు స్వీకరించారు. ఐఎస్‌ఐ డీజీ పదవీ విరమణ పొందితేనో.. లేదా ఆ స్థానంలో ఆర్మీ చీఫ్ మరొకరిని నియమిస్తేనో తప్ప.. ఐఎస్‌ఐ చీఫ్‌ను మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు.
అయితే తాజా కథనం ప్రకారం అక్తర్ తన పదవీ కాలం కన్నా ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అక్తర్ స్థానంలో కరాచీ సైనిక దళం కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్‌ను నియమించనున్నట్లు అధికారులు తెలిపారని మీడియా సంస్థ వెల్లడించింది. అయితే దీన్ని పాక్ మిలటరీ ప్రతినిధి బజ్వా కొట్టిపారేశారు. కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థ కూడా.. ఐఎస్‌ఐ చీఫ్‌ను ఎందుకు మార్చుతారనే విషయాన్ని ప్రస్తావించలేదు.