13 ఏళ్లలో మొదటిసారి..
ఇస్లామాబాద్: పగటి పూట మాత్రమే ఉత్సాహంగా ఉంటూ.. రాత్రయితే డీలా పడిపోతున్న పాకిస్తాన్ 'సోలార్ కిడ్స్'.. రషీద్, హషీమ్లు ఎట్టకేలకు కొంత పురోగతి సాధించారు. తొమ్మిదేళ్ల వయసున్న రషీద్, పదమూడేళ్ల వయసుగల హసీమ్ సోదరులు బుధవారం రాత్రి తమ జీవితంలో మొదటి సారిగా రాత్రి వేళలో కొంత సమయాన్ని ఆస్వాదించారు. 13 ఏళ్లలో మొదటిసారిగా రాత్రి వేళ తన కుమారులు స్వయంగా మెట్లెక్కారనీ, కాసిన్ని మంచినీరు కూడా త్రాగారని వారి తండ్రి మహమ్మద్ హషిం హర్షం వ్యక్తం చేశాడు.
పగటి పూట అందరు పిల్లల మాదిరిగానే ఉంటున్న ఈ చిన్నారులు సూర్యుడు అస్తమించడంతోనే వారి చైతన్యాన్ని కోల్పోతున్నారు. మళ్లీ సూర్యోదయం కాగానే శక్తి పుంజుకుంటున్నారు. దీనికి పరిష్కారం కోసం ఇటీవల వారికి నిర్వహిస్తున్న న్యూరోట్రాన్స్మిషన్ ట్రీట్మెంట్ మూలంగా కొంత మార్పు వచ్చిందని హషిం తెలిపాడు. అయితే ఈ చిన్నారుల డీఎన్ఏను పరీక్షించడం ద్వారా వైద్యులు వారి సమస్యకు పూర్తి పరిష్కారం చూపాలని భావిస్తున్నప్పటికీ.. ఇప్పటికే 300కు పైగా డీఎన్ఏ టెస్టులు నిర్వహించినా ఆశించిన ఫలితం మాత్రం లేదు. వీరికి పూర్తి స్థాయిలో నయం చేసేందుకు అమెరికాలోని మేరిలాండ్ యూనివర్సిటీ బృందం సైతం సహకారం అందిస్తోంది. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారుల వైద్యరంగానికే సవాల్ విసురుతున్నారు.