పర్సు పోయిందనుకోండి.. అందులో డబ్బు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఆ డబ్బులు తీసుకుని పర్స్ పడేస్తారు. ఒకవేళ డబ్బులేమీ లేకపోతే.. ఆ ఏముంది.. ‘బ్రదర్ మీ పర్సు కింద పడింది.. తీసుకోండి అని తిరిగిచ్చేస్తారు’అంతే కదా.. మీరనుకునేది. పర్సులో డబ్బు ఎంత ఎక్కువ ఉంటే నిజాయితీ అంత తక్కువ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదట. పోగొట్టుకున్న పర్సులో ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత నిజాయితీ ఉంటుందట. దాదాపు 40 దేశాల్లో 355 నగరాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. డబ్బులకు, మానవ సైకాలజీకి మధ్య సంబంధం గురించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరితో పాటు యూనివర్సిటీ ఆఫ్ జురిచ్, యూనివర్సిటీ ఆఫ్ ఉతాకు చెందిన పరిశోధకులు కూడా పాల్గొ న్నారు. నిజాయితీగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్, నార్వే టాప్‌లో ఉండగా, పెరూ, మొరాకో, చైనా చివరి స్థానంలో ఉన్నాయి. ఈ అన్ని దేశాల్లో మాత్రం ఒకే విషయం కామన్‌గా ఉందట. అదేంటంటే డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ పర్స్‌ను తిరిగి ఇచ్చేస్తారని తేలిందట. సాధారణంగా ఎవరైనా పర్స్ పోగొట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది తిరిగి ఇస్తారట. అయితే అందులో డబ్బులు ఉంటే మాత్రం 51 శాతం మంది పర్స్ తిరిగిచ్చేస్తున్నారట. ఈ పరిశోధన నిర్వహించేందుకు చాలా డబ్బు వెచ్చించారట. బ్యాంకులు, థియేటర్లు, మ్యూజియంలు, పోస్ట్ ఆఫీస్‌లు, హోటల్స్, పోలీస్ స్టేషన్స్, కోర్టులు తదితర 17 వేలకు పైగా ప్రాంతాల్లో దాదాపు డబ్బులను పర్సులో పెట్టి జారవిడిచారట. అందుకోసం దాదాపు రూ.4 కోట్లకు పైగా డబ్బు వెచ్చించారట. అయితే చాలా మంది అందులో డబ్బు ఎక్కువగా ఉందని తిరిగిచ్చారట. అదండీ విషయం.. డబ్బు అందరినీ చెడ్డవారిని చేయదండోయ్!
Comments
Please login to add a commentAdd a comment