లండన్ : నిరాటంకంగా పరుగెత్తే కాలం.. ఒక్కసారే ఆగిపోయింది. తన గురించి ఎన్నెన్నో రహస్యాలను శోధించిన శాస్త్రవేత్తను తీసుకుని తిరిగి పయనమైపోయింది. అవును. విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు, కాలజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ (76) మరిలేరు. ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. లండన్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.
నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ దశాబ్ధాలుగా చక్రాల కుర్చీకే పరిమితమైనా, కంప్యూటర్ సాయంతో విశేష జీవితాన్ని గడిపారాయన. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో1942, జనవరి 8న జన్మించారాయన. హాకింగ్ పూర్తిపేరు స్టీఫెన్ విలియం హాకింగ్. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల్లో భౌతిక శాస్త్రాన్ని ఔపోసనపట్టిన ఆయన.. కృష్ణబిలాల(కాలబిలాల)పై లోతైన అధ్యయం చేశారు. ఆ క్రమంలో కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో హాకింగ్ రాసిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్’ పుస్తకం ప్రపంచంలోనే బెస్ట్‌సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.
భూగోళంపై మనిషి గనుగడకు కాలం తీరిపోనుందంటూ హెచ్చరించిన హాకింగ్.. వీలైనంత త్వరగా ఇతర గ్రహాలపై ఆవాసాలు నిర్మించాలని గట్టిగా కోరిన సంగతి తెలిసిందే. ‘‘మరణం తర్వాత జీవితం లేదు.. స్వర్గం అనేది కట్టుకథ’’ అని ఆయన తన పుస్తకంలో చెప్పారు. అయితే నిత్యం కొత్తలోకాలకు వెళ్లాలని కోరిన ఆయన.. మనకంటే ముందే అక్కడ ఉంటారని ఆశిద్దాం. హాకింగ్ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment