అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఈ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుఎస్ ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం తూర్పు ఇంగ్లాండ్ లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లాకెన్హిత్ స్టేషన్ సమీపంలో గురువారం కూలిపోయింది. విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కాలిఫోర్నియా మిలటరీ ఆఫీసర్ సర్జంట్ డొనాల్డ్ బెహన్నర్ తెలిపారు. ప్రమాదంలో పైలట్ సింగిల్ సీట్ ఫైటర్ జెట్ విమానం నుండి దూరంగా విసిరివేయబడినట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికాకు చెందిన ఆరు ఫైటర్ జెట్ విమానాలతో కూడిన వింగ్ బ్రిటన్లో ఆరు మాసాల సేవల అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో వింగ్లోని మిగిలిన ఐదు ఫైటర్ జెట్లను సమీపంలోని ఎయిర్ బేస్లో లాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో యుఎస్ ఎఫ్-15 ఫైటర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఈ ప్రమాదంలో పైలట్ గాయాలతో బయట పడ్డాడు.