pilot killed
-
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్‌గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్‌గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్‌లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్‌గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
కూలిన మిగ్ 21
షిమ్లా: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే జవాలీకి సమీపంలోగల పట్టా జతియన్ గ్రామంలో మధ్యాహ్నం 1.21గంటలకు కుప్పకూలింది. విమానం కూలిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. సహాయక చర్యలకోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్లు రంగంలోకి దిగాయి. జరిగిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో కలిపి.. ఈ ఏడాది ప్రమాదాలకు గురైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఅఊ) విమానాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్–30, జూన్ 5న గుజరాత్‌లోని కచ్‌లో జాగ్వర్ విమానాలు కుప్పకూలాయి. మే 27న జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మిగ్–21 ఫైటర్ కూలిపోయింది. ఒకప్పుడు మిగ్ 21 ఫైటర్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అత్యంత కీలకమైనదిగా నిలిచింది. -
విమాన ప్రమాదంలో పైలట్ దుర్మరణం
టీ.నగర్: అసోం జరిగిన విమాన ప్రమాదంలో తాంబరానికి చెందిన పైలట్ సహా ఇద్దరు మృతి చెందారు. అసోం జోరహట్ వైమానికదళం నుంచి ఓ చిన్న విమానంలో వింగ్ కమాండర్ జైపాల్ జేమ్స్, టి.వత్సస్ నిఘా పనుల నిమిత్తం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. మజులి ఉత్తర ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న దీవి ప్రాంతానికి వెళుతుండగా విమానంలో హఠాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం ఇసుక దిబ్బను ఢీకొని పేలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. విమానం పేలుడును గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం తెలిపారు. సంఘటనా స్థలానికి వైమానిక దళ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అయినప్పటికీ విమానం పూర్తిగా కాలిపోవడంతో ఆ విమానంలో ఉన్న పైలట్లను కాపాడేందుకు వీలు కాలేదని పోలీసులు తెలిపారు. తాంబరం పైలట్: మృతి చెందిన ఇద్దరిలో ఒకరు చెన్నై ఈస్ట్ తాంబరానికి చెందిన జయపాల్ జేమ్స్ (47) గా తెలిసింది. మరొకరి పేరు టి.వత్సస్. జేమ్స్ తండ్రి జయపాల్ వైమానిక దళంలో పని చేసి పదవీ విరమణ పొందారు. జేమ్స్‌కు భార్య గ్రేస్, కుమారుడు రోషన్, కుమార్తె రోస్మి ఉన్నారు. జేమ్స్ అంత్యక్రియలు బెంగళూరులో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దీని గురించి జేమ్స్ తండ్రి జయపాల్ మాట్లాడుతూ తన కుమారుడు జయపాల్ జేమ్స్ విమానంలో వెళుతూ ప్రమాదంలో మృతి చెందాడని, అతని భార్య, పిల్లలు బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. దీంతో అంత్యక్రియలు బెంగళూరులో జరుగుతాయన్నారు. తన కుమారుడు చిన్ననాటి నుంచి పైలట్‌గా చేరాలన్న ఆశతో వైమానికదళంలో చేరినట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఈస్ట్ తాంబరం ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు జయపాల్‌ను కలిసి ఓదార్చారు. -
కూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం
కరాచీ: పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. మస్రూర్ బేస్ నుంచి వెళ్తుండగా కరాచీకి 16 కిలో మీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్టు అధికారులు చెప్పారు. సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలాని చేరుకున్నారు. ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా ఈ విమానం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. జనావాసాలకు దూరంగా విమానం కూలడంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్‌లో తయారు చేశారు. గత నెలలో కూడా పాక్‌లో ఓ యుద్ధ విమానం కూలిన ఘటనలో పైలట్ మరణించాడు. -
కూలిన ఫైటర్ జెట్, పైలట్ మృతి
అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుఎస్ ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం తూర్పు ఇంగ్లాండ్ లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లాకెన్హిత్ స్టేషన్ సమీపంలో గురువారం కూలిపోయింది. విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కాలిఫోర్నియా మిలటరీ ఆఫీసర్ సర్జంట్ డొనాల్డ్ బెహన్నర్ తెలిపారు. ప్రమాదంలో పైలట్ సింగిల్ సీట్ ఫైటర్ జెట్ విమానం నుండి దూరంగా విసిరివేయబడినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆరు ఫైటర్ జెట్ విమానాలతో కూడిన వింగ్ బ్రిటన్‌లో ఆరు మాసాల సేవల అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో వింగ్‌లోని మిగిలిన ఐదు ఫైటర్ జెట్లను సమీపంలోని ఎయిర్ బేస్‌లో లాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో యుఎస్ ఎఫ్-15 ఫైటర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఈ ప్రమాదంలో పైలట్ గాయాలతో బయట పడ్డాడు.