ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు.. మధ్యలో ఏదో సమస్య వచ్చి.. ఒకరి ప్లేసులోకి మరొకరు వెళ్తారు.. లేదా.. హీరో వల్ల విలన్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు.. దీంతో తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా హీరో ముఖంలా కనిపించేటట్లు మార్చేసుకుని.. హీరోను ఇబ్బందులు పెడతాడు. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో చూశాం. ఆ మధ్య వచ్చిన ‘ఎవడు’సినిమాలో కూడా జయసుధ అల్లు అర్జున్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసి.. తన కొడుకైన రామ్‌చరణ్ తేజలా అతడి ముఖాన్ని మార్చేస్తుంది.. సినిమాల్లో ఒకే.. కానీ నిజజీవితంలో ఇది సాధ్యమా? ఓసారి ఈ ఫొటోను చూడండి.. రెండూ ఒకరి ఫొటోలాగే కనిపిస్తున్నా.. ఇద్దరూ వేర్వేరు.. అలాగని కవలలు కాదు.. ఇందులో ఒకరు సినిమా తార(కుడివైపు).
మరొకరు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తనకు ఇష్టమైన తారలాగే మారిపోయిన ఆమె అభిమాని. ఫాన్ బింగ్‌బింగ్. చైనాలో క్రేజీ స్టార్. ఆమె అందానికి చాలా మంది ఫిదా. హే చెంగ్జీ కూడా ఆమెలాగే కావాలనుకుంది. 8 ఏళ్లు కష్టపడింది.. రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు.. అంతే.. కట్ చేస్తే.. ఎవరు ఒరిజినల్.. ఎవరు డూప్లికేట్ అన్న విషయాన్ని కనిపెట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. కొన్నిసార్లు పేపర్లలో ఫాన్ బింగ్‌బింగ్ అంటూ చెంగ్జీ ఫొటోలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
ఓసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఫాన్ బింగ్‌బింగ్, చెంగ్జీలు వేర్వేరుగా వచ్చారు. అయితే.. మరుసటి రోజు కొన్ని పేపర్లలో ఫాన్ బింగ్‌బింగ్ అంటూ చెంగ్జీ చిత్రాలు వచ్చాయి. ఫొటోగ్రాఫర్లు ఇద్దరి మధ్యా తేడాను కనుగొనలేక అయోమయంలో పడేవారు. తనకు ఫాన్ బింగ్‌బింగ్ అంటే ఇష్టమేనని.. అయితే.. తనకంటూ సొంత వ్యక్తిత్వముందని.. తనను తననుగానే గుర్తించాలని చెంగ్జీ అంటోంది. ఇంకో విషయం.. చెంగ్జీ ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఓ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్‌ను కూడా పెట్టారట. అది కూడా చెంగ్జీలాగే సూపర్ హిట్. – సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment