కుక్కపిల్లపై కాల్పులు.. యువకుడి ఛాతిలోకి బుల్లెట్లు!
లాస్ ఏంజెలిస్: పోలీసు అధికారిని ఓ కుక్కపిల్ల కరిచిందని ఆవేశంగా దానిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ తాకడంతో ఓ యువకుడు అక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఈ విషాదం కాలిఫోర్నియాలోని పామ్ డేల్ల్లో చోటుచేసుకుంది. లాస్ ఏంజెలిస్ కౌంటీ షెరిఫ్ అధికారుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో అధిక శబ్దాలతో మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి చుట్టుపక్కల ఇళ్లవారికి ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇంతలో మూడేళ్ల ఓ బుజ్జి కుక్కపిల్ల ఓ పోలీసుపై దాడిచేసి మోకాలుపై కరిచింది. గాయపడ్డ పోలీసు ఒక్కసారిగా అరవడంతో మిగిలిన సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇంతలోనే కుక్కపిల్ల ఆ ఇంటి నుంచి వీదుల్లోకి ప రుగులు తీసింది. విచారణకు వస్తే మాపైనే కుక్కను వదులుతారా అంటూ పోలీసులు కుక్కపిల్లపై తుపాకీతో కాల్పులు జరిపారు. సరిగ్గా ఆ సమయంతో ఆ దారిలో వెళ్తున్న 17 ఏళ్ల యువకుడు అర్మాండో గార్సికా మూరో ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో కుప్పకూలిపోయాడు. దగ్గరికి వచ్చి చూసి యువకుడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోవడం కౌంటీ పోలీసుల వంతయింది. వెంటనే ఆర్మాండోను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అర్మాండో మృతిచెందాడని తెలిపారు.
ఈ ఘటనపై క్రిస్టోఫర బెర్గ్‌నర్ అనే అధికారి మాట్లాడుతూ.. ‘సహోద్యోగిని కరిచి పోరిపోతుందన్న ఆవేశంలో ఇద్దరు పోలీసులు దాదాపు ఆరు రౌండ్లు కుక్కపిల్లపై కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తూ ఆ దారిలో వెళ్తున్న ఆర్మాండో అనే యువకుడు చనిపోయాడు. విచారణకు వెళ్లిన సమయంలో ఐదుగురు పోలీసులున్నారు. కానీ ఇద్దరు పోలీసుల చర్యతో ఈ విషాదం చోటుచేసుకుందని’ వివరించారు.
‘నా ఇంటికి ఎంతోమంది పిల్లలు, పెద్దవారు వస్తుంటారు. వారికి ఇష్టం వచ్చిన మ్యూజిక్ సిస్టమ్స్‌తో పాటలు వింటారు. ఇందులో తప్పేముంది. ఆ కుక్కపిల్ల నాది కాదు. మూడేళ్ల పెట్ డాగ్‌పై కాల్పులు జరిపి మూల్యం చెల్లించుకున్నారని’ ఇంటి యజమానురాలు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.