ఓస్లో: ప్రపంచంలో జైలు అనగానే ఊచలున్న, గాలి వెలుతరురాని నాలుగు గదుల గోడ, రుచీ పచిలేని తిండి, చుట్టూ తుపాకులతో కాపలాకాచే పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం, పోలీసు పద ఘట్టనలు, కాపలా కుక్కల అరుపులు గుర్తొస్తాయి. జైలంటే ఏ మాత్రం స్వేచ్ఛలేని దుర్భర జీవితం. నార్వేలోని బాస్టాయ్ జైలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆ జైలుపక్షుల దైనందిన జీవితం గురించి వింటే మనమే నేరం చేసి జైలుకు వెళితే బాగుండునేమో అనిపిస్తుంది.
అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేపకుండానే క్రమశిక్షణతో పొద్దునే లేస్తారు. అందరూ వ్యాయామం చేస్తారు. కొందరు జైల్లోనే ఉన్న జిమ్‌కు వెళతారు. కసరత్తు చేస్తారు. కండలు పెంచుతారు. టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత ఆపక్కనే ఉన్న బీచ్‌కు వెళతారు. సన్‌బాత్ చేస్తారు. కొందరు సముద్రంలో జలకాలాడుతారు. పైన్ చెట్లను నీడన సేదతీరుతారు. ఆ తర్వాత జైలు నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు గాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఎక్కువ వరకు ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు.
ఈ బాస్టాయ్ జైల్లో కటకటాల గదులు ఉండవు. చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులు ఉంటాయి. ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటరు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు. సొంతంగా ఎవరికిష్టమైన బట్టలు వారు కొనుక్కోవచ్చు, వాటిని వేసుకోవచ్చు.
ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. అన్ని సౌకర్యాలు ఉండడం ఒక్కటే ఇందుకు కారణం కాదు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడి పోతారు. వివిధ ఉద్యోగాలను కల్పించేందుకు కూడా నార్వే ప్రభుత్వం సహకరిస్తుంది. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో తీవ్ర హింసాత్మక నేరాలు చేసిన వారు కూడా ఉన్నారు.
ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. ఒక్కసారి నేరం చేసినవారు, మరోసారి నేరం చేయకుండా వాళ్లలో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది.
ఒకసారి జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాక మరో రెండేళ్లలోనే అలాంటి నేరం చేసి జైలుకు వచ్చే వారి సంఖ్య నార్వేలో 20 శాతం మాత్రం. అదే అమెరికాలో మళ్లీ జైలుకు వచ్చే వారి సంఖ్య 50 శాతానికిపైగా ఉంది. నార్వేలో యావజ్జీవ శిక్ష ఉండదు. తీవ్ర నేరాలకు గరిష్ట శిక్ష 21 ఏళ్లు. మరీ తీవ్రమైన మానవ హననానికి పాల్పడితే 30 ఏళ్ల జైలు శిక్ష. 60 శాతం ఖైదీలకు మూడు నెలలలోపే శిక్షలు పడతాయి. 90 శాతం ఖైదీలకు ఏడాది లోపే శిక్ష అనుభవిస్తారు. బాస్టాయ్ జైలు నుంచి సాధారణంగా ఎవరూ పారిపోరు. 2015లో ఓ ఖైదీ సర్వ్‌బోర్డు ద్వారా పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. అలా పట్టుబడిన వ్యక్తిని కొంత కఠినమైన మరో జైలుకు తరలిస్తారు.