
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్ వజీర్ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చిన ఆరిఫ్‌పై శుక్రవారం అర్థరాత్రి ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్రం దక్షిణ వజీరిస్తాన్‌లోని తని నివాసంలో గుర్తుతెలియని దుండగడులు కాల్పులు జరిపారు. దీంతో ఆరిఫ్‌కు తీవ్రగాయాలు కాగా, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, 2017లో ఆరిఫ్ కుటుంబ సభ్యులు కూడా హత్యకు గురయ్యారు. ఆరిఫ్‌తో గొడవపడ్డ కొందరు ఉగ్రవాదులు అతని కుంటుంబంలో ఏడుగురు వ్యక్తులను కాల్చిచంపారు.
పష్తూన్ తహఫ్పూజ్ మూవ్‌మెంట్ 2014లో ప్రారంభమైంది. పష్తీన్ అనే ఒక యువకుడు దీనిని ప్రారంభించాడు. గిరిజన సమాజానికి జరుగుతున్న అన్యాయంపై, ముఖ్యంగా పష్తూన్ల హక్కుల కోసం పీటీఎం పనిచేస్తోంది. మొదట్లో ఇది ప్రజలను తమవైపు ఆకర్షించడంలో అంత విజయవంతం కాలేకపోయింది. కానీ మెల్లమెల్లగా దాని మద్దతుదారులు ఎంతగా పెరిగారంటే.. ఇప్పుడు వారు పాకిస్తాన్ ప్రభుత్వానికే పెను సవాలుగా నిలిచారు.