పోయిన పాక్‌ పరువు | Pulwama Attacks on Hands Over Dozzier To Pakistan, Us, Uae, China | Sakshi
Sakshi News home page

పోయిన పాక్‌ పరువు

Published Sun, Mar 3 2019 4:50 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Pulwama Attacks on Hands Over Dozzier To Pakistan, Us, Uae, China - Sakshi

భారత్‌ వైమానిక దళం బాలాకోట్‌పై దాడి చేసిన దగ్గర నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాలు పాకిస్తాన్‌కు కొన్ని గుణపాఠాలు నేర్పాయి. వాటిలో మొదటిది, పాక్‌ దగ్గరున్న అణుబాంబులను చూసి భారత్‌ భయపడబోదన్న వాస్తవం. భారత వైమానిక దళం పాకిస్తాన్‌ భూభాగంలోకి చొరబడి చేసిన దాడిపై పాకిస్తాన్‌ స్పందనను బట్టి రెండు ‘అణ్వస్త్ర’ దేశాల మధ్య యుద్ధం జరిగినా అణుబాంబులు బయటకు రావని, సంప్రదాయ యుద్ధమే జరుగుతుందని తేలింది.

పాకిస్తాన్‌ ఇలాగే భారత్‌పై పరోక్ష యుద్ధం కొనసాగించే పక్షంలో అవసరమైతే పాక్‌ భూభాగంలోకి చొరబడైనా చర్య తీసుకునే అవకాశాన్ని భారత్‌కు ఇచ్చింది. ఇక రెండోది, పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు భారత సరిహద్దులోపలి సైనిక కార్యాలయంపై దాడికి యత్నించడం, దానిని భారత్‌ తిప్పికొట్టడాన్ని బట్టి ఆత్మరక్షణకోసం భారత్‌ యుద్ధానికి కూడా వెనకాడదన్నది రెండో పాఠం. పరువు కాపాడుకోవడం కోసం ప్రతీకారానికి దిగి పాక్‌ పెద్ద తప్పు చేసింది. భారత సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రతి చర్య తీసుకునే అవకాశాన్ని  భారత్‌కు కల్పించింది. 

భారత సైనిక స్థావరంపై పాక్‌ దాడికి యత్నించడం పాక్‌ సైన్యానికి ఉగ్రవాదులకు ఉన్న బంధాన్ని ప్రపంచదేశాల ముందు ఎత్తి చూపింది. ఆర్థికంగా, దౌత్యపరంగా భారత్‌  పైచేయిగానే ఉందన్నది పాక్‌ తెలుసుకున్న మూడో పాఠం. బాలాకోట్‌ దాడి, అభినందన్‌ను పాక్‌ బందీగా పట్టుకోవడం విషయాల్లో అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో భారత్‌కు మద్దతు పలికింది. భారతదేశం పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయినా దాన్నెవరూ తప్పుపట్టలేదు. ఆత్మరక్షణకు తీసుకున్న చర్యగా సమర్థించారు.

అంతేకాకుండా పాకిస్తాన్‌ తనగడ్డమీద ఉగ్రవాదులను పోషిస్తోందంటూ ప్రపంచం నిందించింది. పాకిస్తాన్‌కు మంచి స్నేహితుడైన చైనా సంయమనం పాటించాలని అడిగిందే కానీ, భారత్‌ చర్యలను తప్పు పట్టలేదు. భారత్‌ ఆత్మరక్షణ హక్కును అమెరికా, ఫ్రాన్స్‌ సమర్థించాయి. పుల్వామా దాడిని ఖండించిన జపాన్, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించింది. ఆస్ట్రేలియా కూడా భారత్‌ వైఖరిని సమర్థించింది.  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. పాక్‌తో చెట్టాపట్టాలేసుకునే అరబ్‌ దేశాలు సైతం ఉద్రిక్తతల్ని పెంచవద్దని పాక్‌కు స్పష్టం చేయడంతో పాటు అభినందన్‌ను విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చాయి.

ఇమ్రాన్‌కు ఎదురు దెబ్బ
అభినందన్‌తో పాక్‌ పరువు దక్కించుకోవడం నాలుగో విషయం. అభి సాయంతో భారత్‌ను దారికి తెద్దామన్న ఆలోచన ఫలించలేదు. అమెరికా, యూఏఈ, సౌదీల ఒత్తిడితో  ఇమ్రాన్‌ఖాన్‌ శాంతిదూత అవతారం దాల్చి అభినందన్‌ విడుదలకు సిద్ధపడ్డాడు. అభినందన్‌ వ్యవహారంలో పాకిస్తాన్‌ అవివేకం బయటపడటం ఐదో విషయం. బందీగా ఉన్న అభినందన్‌తో తనను పొగిడించుకుంటూ పాక్‌ విడుదలచేసిన వీడియో జెనీవా నిబంధనలకు విరుద్ధం. ఈ ఘటనతో పాక్‌ అపరిపక్వత బయటపడి పరువు పూర్తిగా పోగొట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement