ఆడవారి చూపు ఎటువైపు!
లండన్: మీరు ఎదురుగా నిల్చున్న వారి ముఖంలోకి చూస్తూ మాట్లాడుతున్నారా? అయితే ఆ ముఖంలో మీరు ఎటువైపు చూస్తున్నారు? అనే విషయాన్ని ఓసారి గమనించండి. అంటే కుడివైపు చూస్తున్నారా..? ఎడమవైపు చూస్తున్నారా ? ఎటు చూస్తే ఏంటి ? ఇవేం ప్రశ్నలు అనుకోకండి. స్త్రీ, పురుషులు తమ ఎదురుగా ఉన్నవారి ముఖాల్లోకి చూసే తీరులో స్పష్టమైన తేడా ఉంటుందని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
లింగపరమైన బేధాలపై అధ్యయనంలో భాగంగా జరిపిన పరిశోధన సందర్భంగా మహిళలు, పురుషులు చూసే విధానంలో తేడా ఉంటుందని గుర్తించారు. సుమారు 500 మందిపై ఐదువారాల పాటు నిర్వహించిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఐ ట్రాకింగ్ డివైస్’ సహాయంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళలు కంప్యూటర్ తెరపై ఎదురుగా ఉన్న మొహంలో ఎక్కువగా ఎడమ వైపు చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఎడమ కంటి భాగంపై వారి దృష్టి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.