ఆ హంతకుడు ఎవరంటే...
క్రైమ్ మిస్టరీ
లండన్‌లోని వైట్‌చాపెల్ ప్రాంతంలో ఒకప్పుడు మూడు నెలల కాలంలో వరుసగా ఆరుగురు మహిళలు క్రూరంగా హత్యకు గురయ్యారు. 1888లో జరిగిన ఈ వరుస హత్యల గురించి ఎంతో దర్యాప్తు జరిగింది. కానీ హంతకుడెవరో పట్టుకోలేకపోయారు. ‘వైట్ చాపెల్’లో జరిగిన హత్యాకాండ ప్రపంచంలోని ‘గ్రేటెస్ట్ క్రైం మిస్టరీ’లలో ప్రముఖంగా నిలిచింది.
తాజా వార్త ఏమిటంటే, వేల్స్ యూనివర్సిటీకి చెందిన క్రిమినాలజిస్ట్ డా. నారిస్ ‘ఆ హంతకుడు ఎవరో కాదు...’ అంటూ సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. అప్పట్లో విక్టోరియా రాణి మనవడు ప్రిన్స్ ఆల్బర్ట్ విక్టర్, రాణిగారి వ్యక్తిగత వైద్యుడు సర్ విలియమ్‌తో సహా... ఎందరో పేరున్న వాళ్లను అనుమానితుల జాబితాలో చేర్చి ప్రశ్నించారు పోలీసులు.
‘‘అసలు హంతకుడు మాత్రం చార్లెస్ ఎలెన్’’ అంటున్నాడు డా.నారిస్. ఇంతకీ, ఎవరీ చార్లెస్ ఎలెన్?
వరుస హత్యలు జరిగిన వైట్‌చాపెల్ ప్రాంతంలో రోజూ బండి మీద తిరుగుతూ మాంసం విక్రయిస్తుంటాడు చార్లెస్ ఎలెన్. 1888 ఆగస్ట్ 31న నికోలస్ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె మృతదేహం దగ్గర చార్లెస్ అనుమానాస్పదస్థితిలో కనిపించాడు.
‘‘మాంసం అమ్ముకోవడానికి రోజూ వీధుల్లో తిరుగుతుంటాను’’ అని పోలీసులకు చెప్పాడు చార్లెస్. అతడి సమాధానంలో అనుమానించదగినది ఏమీ లేకపోవడంతో పోలీసులు అతడిని వదిలేశారు. డా. నారిస్ చెబుతున్న ప్రకారం... రెండు విషయాలు చార్లెసే హంతకుడన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
ఒకటి: అతను తన పేరును పోలీసులకు ఎందుకు తప్పుగా చెప్పాడు?
రెండు: చార్లెస్ తన తల్లితో పాటు బెర్నెర్స్ స్ట్రీట్‌లో ఉండేవాడు. హత్యలకు ముందు తల్లి ఎందుకు కనిపించకుండా పోయింది?
డా. నారిస్ కృషి వల్ల సుదీర్ఘకాలం నుంచి చిక్కుముడిగా మిగిలిన మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తుంది.