
'ఆమె నా పక్కన కూర్చోవద్దు'
న్యూయార్క్: ఆధునికత సంతరించుకున్నా మూఢ విశ్వాసాలు, మత నమ్మకాలు వ్యక్తుల మధ్య దూరాన్ని మరింత పెంచుతునే ఉన్నాయి. అవి మన దేశానికే పరిమితమంటే పొరపాటు పడ్డట్టే.. ఎందుకంటే ఇప్పుడవి విదేశాల్లో కూడా ప్రభల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విమానంలో తన పక్క సీటులో మహిళ ఉంటే ప్రయాణించడం సాధ్యంకాదని అల్ట్రా ఆర్థడాక్స్కు చెందిన యూదు వ్యక్తి ఒకరు విమానంలో కాస్త చర్చకు దిగారు. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నుంచి లండన్ బయలు దేరుతున్న విమానంలో ఓ యూదు పౌరుడు సీటు విమానం కిటికీ పక్కన ఉంది.
అతడి పక్క సీట్లోనే ఫ్రాన్సిస్కా హోగి అనే మరో మహిళ సీటు ఉంది. అయితే, ఆమెను వెళ్లి మరో సీటులో కూర్చోవాల్సిందిగా, తన భార్య కానీ స్త్రీ పక్క సీటులో ఉంటే ప్రయాణం చేయడాన్ని తన మతం అనుమతించబోదని చెప్పారు. ఇలా చెప్పడం ఆమెకు ముందు కాస్తంత ఇబ్బంది కలిగించింది. ఓ రకంగా వాదనకు దిగే పరిస్థితిని సృష్టించింది. అయినా ఆమె సహనంతో వ్యవహరించి తన భర్తను ఆ యూదు పౌరుడి పక్కన కూర్చొబెట్టి ఆమె భర్త సీటులో కూర్చుంది. కానీ, తనకు మాత్రం జాతి వివక్షలాగే అనిపించింది. ఎందుకంటే ఆమె ఓ నల్లజాతి పౌరురాలు. ఇజ్రాయెల్ నుంచి న్యూయార్క్ మధ్య ప్రయాణించే విమానాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి.