టెక్నాలజీ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి అవసరానికి కూడా టెక్నాలజీ వచ్చేసింది. ఆన్ లైన్‌లో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక రోబోలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కారం కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమాలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబితే అదే చేస్తుంది. ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే వరకు.. ఇలా అన్ని రంగాల్లోనూ మర మనుషులు సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ రంగంలోకి రోబోలు వచ్చేశాయి.
ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫేమస్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. వెంటనే ఓ రోబో ఆ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడున్న ఓ వెయిటర్.. సదరు వ్యక్తి ఆర్డర్ చేసిన పుడ్‌ను ఆ రోబోలో సర్దాడు. అంతే ఆ రోబో రోడెక్కింది. నెమ్మదిగా బయలుదేరి ఆ వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వెంటనే మీ ఫుడ్ మీ ఇంటి ముందుకు వచ్చింది అంటూ ఓ మెసేజ్ వచ్చింది. తలుపు తీసి చూస్తే ఓ బుల్లి రోబో ఇంటి ముందు వేయిట్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో ఓ బటన్ నొక్కగానే రోబో తన మూతను అన్‌లాక్ చేసింది. వెంటనే ఆవ్యక్తి ఫుడ్ తీసుకున్నాడు. రోబో థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. ఇదంత వినడానికి ఆశ్చర్యంగా, ఏదో సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది కదా..! కానీ ఇది నిజం. తమ విద్యార్థులకు పుడ్ డెలివరీ చేయడం కోసం బుల్లి రోబోలను ఉపయోగిస్తుంది అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం. విద్యార్థులకు ఫుడ్ సరఫరా చేయడం కోసం స్టార్‌షిప్ టెక్నాలజీస్ సంస్థ నుంచి 30 రోబోలను కొనుగోలు చేసింది.
సమయం ఆదా..
రోబోలతో పుడ్ డెలివరీ చేయడం ద్వారా విద్యార్థులకు విలువైన సమయం ఆదా అవుతుందని యూనివర్సీటీ యాజమాన్యం చెబుతోంది. భోజనం కోసం లైన్లో నిలబడటానికి ఇష్టపడని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ రోబోలను తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ఆదా అయిన సమయాన్ని ఇతర అంశాలపై పెట్టి వారు అనుకునేది సాధించగలరనే ఆశాభావంతో రోబోలను ప్రవేశపెట్టామని యూనివర్సీటీ యాజమాన్యం పేర్కొంది.
ఎలా పనిచేస్తాయి
స్టార్‌షిప్ యాప్ ద్వారా కావాల్సిన రెస్టారెంట్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేయాలి. డబ్బులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. తర్వాత స్టార్‌షిప్ టెక్నాలజీస్ నుంచి ఆరుచక్రాల ఓ రోబో ఆ రెస్టారెంట్‌కు వెళ్తుంది. అక్కడ ఉన్న వెయిటర్.. మనం ఆర్డర్ చేసిన ఫుడ్‌ను రోబోలో సర్దుతారు. వెంటనే ఆ రోబో రోడెక్కి మన దగ్గరకు వస్తుంది. మన ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. బుల్లి రోబో మనవద్దకు రాగానే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓపెన్ బటన్ నొక్కాలి. వేంటనే రోబో మూత తెరచుకుంటుంది. పుడ్‌ను తీసుకోగానే అన్‌లాక్ అవుతుంది. అనంతరం రోబో అక్కడి నుంచి వెనుదిరుగుతుంది.
బర్గర్, కాఫీ.. ఏదైనా..
స్టార్‌షిప్ సంస్థ వారి యాప్ ద్వారా బర్గర్, కాఫీ, టీ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో మూడు రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆరు కాళ్లు ఉండే ఈ రోబోలు ఆ వస్తువులు ఎక్కడ డెలివరీ ఇవ్వాలో వారి ఇంటి ముందుకు వెళ్లి ఇచ్చేలా వీటిని రూపొందించారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఈ రోబోలు మెట్లు ఎక్కగలవు, ఎత్తైన ప్రదేశాల నుంచి వెళ్లగలవు. రోడ్డుపై వాహనాలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలవు. ప్రతి రోబోలో తొమ్మిది కెమెరాలు అమర్చారు.
100 యూనివర్సీటీలు లక్ష్యం
స్టార్‌షిఫ్ రోబోలు ఇప్పటి వరకు నాలుగు యూనివర్సీటీలలో ఉపయోగిస్తున్నారు. మొదటగా జార్జ్ మాసన్ యూనివర్సీటీలో, తర్వాత నార్తర్న్ అరిజోనా, పర్డ్యూ, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయాల్లో వినియోగించారు. రానున్న రెండేళ్లల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సీటీలకు తమ రోబోలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్టార్‌షిప్ టెక్నాలజీస్ సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల్లో ఈ బుల్లి రోబోలను అన్ని నగరాల్లోనూ చూడగలుగుతామేమో!
Comments
Please login to add a commentAdd a comment