పెద్ద నోట్ల రద్దుతో రష్యాకు కూడా కోపం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో రష్యాకు కూడా కోపం వచ్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ దేశానికి చెందిన అధికార ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపట్ల ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదేనని నొక్కి చెప్పింది. వెంటనే తమ దౌత్య ప్రతినిధులకు ఎదురవుతున్న డబ్బు సమస్యను తీర్చాల్సిందిగా రష్యా కోరింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ సమస్య ప్రభావం ఒక్క భారత్‌లోని సామాన్యులనే కాకుండా భారత్‌లో ఉంటున్న, పర్యటిస్తున్న పొరుగు దేశాల వారికి ఇక్కట్లు కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో తమ సమస్యను భారత్‌లో రష్యా రాయబార కార్యాలయ అధికారులు వారి దేశానికి చెప్పగా ఈ విషయంపై కాస్తంగా గట్టిగా చెప్పింది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే భారత్‌తో తాము నిర్వహించాల్సిన పనులు వేగం మందగిస్తుందని, ఒక వేళ తీర్చలేమంటే తాము ప్రత్యామ్నాయాలు కూడా చూసుకుంటామని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది. మాస్కోలోని భారత రాయభార కార్యాలయ అధికారులకు నోటీసులు కూడా పంపిస్తామని మందలించింది. చిన్నచిన్న పనులకు కూడా తమ అధికారులు డబ్బును విత్ డ్రా చేసుకునే పరిస్థితి భారత్‌లో లేకుండా పోయిందని రష్యా రాయబారి అలెగ్జాండర్ కడాకిన్ అన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.