
ఆ అణుబాంబు ఫ్రాన్స్‌ను క్షణాల్లో బుగ్గిచేస్తుంది!
అత్యాధునికమైన, అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ క్షిపణీని ప్రస్తుతం రష్యా పరీక్షించేందుకు సిద్ధమవుతున్నది.
- ఎవ్వరూ ఆపలేని అణ్వాయుధాన్ని పరీక్షిస్తున్న రష్యా
అత్యాధునికమైన, అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ క్షిపణీని ప్రస్తుతం రష్యా పరీక్షించేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్షిపణి నాటో రక్షణ వ్యవస్థను తునాతునకలు చేయడమే కాదు.. దీనిని ప్రయోగించిన క్షణాల్లోనే యూరప్‌లోని ఓ భాగాన్ని బుగ్గిపాలు చేయగలదు.
ఆర్‌ఎస్-28 సర్మాట్ పేరిట రూపొందించిన ఈ క్షిపణి సెకనుకు ఏడో కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. సంప్రదాయ యాంటీ మిస్సైల్ రక్షణ వ్యవస్థలన్నింటినీ ఇది చిత్తుచేయగలదు. ప్రస్తుతం యూరప్‌లో భయాందోళనలు రేపుతున్న ఈ అంతర్జాతీయ బాలిస్టిక్ క్షిపణిని ఈ వేసవిలో పరీక్షించాలని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ భావిస్తోందని ఆ దేశ న్యూస్ నెట్‌వర్క్ జ్వెజ్డా తెలిపింది. ఈ పవర్‌ఫుల్ క్షిపణీని నాటో దళాలు 'సతాన్-2' అభివర్ణిస్తున్నాయి.
విక్టరీ డే పరేడ్ సందర్భంగా ఇటీవల ఈ క్షిపణీని మాస్కోలో తొలిసారి ప్రదర్శించడంతో దీని గురించి ప్రపంచానికి తొలిసారి తెలిసింది. 1945లో హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబులకు రెండువేలరెట్లు శక్తివంతమైన అణ్వాయుధాలను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు. దీని వార్‌హేడ్ సామర్థ్యం 40మెగా టన్నులు కావడం గమనార్హం. దీనిని ఒక్కసారి ప్రయోగిస్తే.. యూరప్‌లోని ఫ్రాన్స్ లేదా, అమెరికా టెక్సాస్ క్షణాల్లో సర్వనాశనమవుతాయని జ్వెజ్డా తన కథనంలో పేర్కొంది.