భారత సంతతి వైద్యుడికి అమెరికాలో రెండోస్థానం
న్యూయార్క్: న్యూరోసర్జన్‌గా అమెరికన్లకు సుపరిచితులైన భారతసంతతి వైద్యుడు సంజయ్ గుప్తా ఆ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైద్యుడిగా స్థానం దక్కించుకున్నారు. వైద్యుల ట్విటర్ ఖాతా సాయంతో ఓ సంస్థ చేసిన సర్వేలో గుప్తాకు రెండోస్థానం దక్కింది. అమెరికాలోని అట్లాంటాలో ఎమోరి క్లినిక్ పేరుతో ఆస్పత్రిని నడుపుతున్న గుప్తాకు ట్విటర్‌లో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
పలుమార్లు ఎమ్మీ అవార్డుతోపాటు సీఎన్‌ఎన్ చీఫ్ మెడికల్ కరెస్పాండెంట్ అవార్డును కూడా అందుకున్న గుప్తాకు అత్యం త సక్సెస్ రేటుతో ఆపరేషన్లు చేసిన వైద్యుడిగా గుర్తింపు ఉంది. ఇక ఈ సర్వే లో 30 లక్షల మంది ఫాలోవర్లతో డ్రూ పిన్‌స్కీ మొదటిస్థానంలో నిలిచారు. 2006 నుంచి కొనసాగుతున్న వైద్యుల ట్విటర్ ఖాతాల ఆధారంగా ఆగస్టానా యూనివర్సిటీ విద్యార్థులు ఈ వివరాలను వెల్లడించారు.