ఖతర్‌తో కటీఫ్...
అరబ్ దేశాలు, మాల్దీవుల నిర్ణయం
► ఉగ్రవాదానికి ఊతమిస్తోందని మండిపాటు
► రవాణా మార్గాల మూసివేత
► ఆరోపణలను తోసిపుచ్చిన ఖతర్
► పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం
రియాద్: పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం తలెత్తింది. ఖతర్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా ఐదు అరబ్ దేశాలు దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్‌ను వెలేసింది. ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నామని లిబియాలోని సమాంతర ప్రభుత్వాల్లో ఒకటైన తూర్పు లిబియాలోని ప్రభుత్వం తెలిపింది.
చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందని సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు సోమవారం ఆరోపించాయి.ఖతర్‌తో రవాణా మార్గాలను మూసేస్తున్నామని, తమ దేశంలోని ఖతర్ పౌరులు రెండువారాల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించాయి. సరిహద్దుల మూసివేతతో ఖతర్‌లో ఆహార సంక్షోభం నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి.
‘ఉగ్రవాద ముప్పు నుంచి మా దేశాన్ని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం.. ముస్లిం బ్రదర్‌హుడ్, దాయెష్(ఐఎస్), అల్ కాయిదా వంటి గ్రూపులకు ఖతర్ మద్దతిస్తోంది.. మా దేశంలోని షియాలు అధికంగా ఉన్న ఖతిఫ్‌తోపాటు బహ్రెయిన్‌లో ఇరాన్ ప్రోద్బలంతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా అండగా నిలుస్తోంది’ అని సౌదీ పేర్కొంది. గల్ఫ్ దేశాలు సంరక్షక పాత్రతో తమపై పెత్తనం చలాయించాలని చూస్తున్నాయని ఖతర్ ఆరోపించింది. ‘వాటి చర్యలు సమర్థనీయం కాదు. తప్పుడు, నిరాధార ప్రకటనల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నాయి’ అని ఖతర్ విదేశాంగ శాఖ విమర్శించింది.
ఖతర్‌కు వెళ్లొద్దు..
తమ పౌరులు ఖతర్‌కు వెళ్లొద్దని, తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లోగా వెళ్లిపోవాలని అరబ్ దేశాలు ఆదేశించాయి. ఖతర్‌తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నట్లు సౌదీ తెలిపింది. మంగళవారం నుంచి ఖతర్‌కు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎమిరేట్స్, ఇతిహాద్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీకి తమ సర్వీసులను తక్షణం మూసేస్తున్నట్లు ఖతర్ కూడా ప్రకటించింది. ఖతర్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఈజిప్టు తెలిపింది.
యెమన్‌లో ఇరాన్ మద్దతున్న రెబల్స్‌పై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి తమ గ్రూపు నుంచి ఖతర్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్‌తో పొరుగు దేశాల తెగతెంపుల నిర్ణయం పశ్చిమాసియాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రయోజనాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఐసిస్, తదితర ఉగ్ర సంస్థలపై పోరులో కీలకమైన అమెరికా ఎయిర్‌బేస్ ఖతర్‌లో ఉంది. 2022లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్రీడలు ఖతర్‌లోనే జరగనున్నాయి. ఆహార పదార్థాలతోపాటు చాలా వస్తువులను ఖతర్ పొరుగు దేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది. ఖత ర్ ప్రజలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆహారాన్ని కొని దాచుకుంటున్నారని వార్తలొచ్చాయి.
భారతీయులే ముఖ్యం: ఖతర్‌తో అరబ్ దేశాల తెగతెంపులు గల్ఫ్ సమన్వయ మండలి అంతర్గత వ్యవహారమని, ఆ ప్రాంతంలోని భారతీయుల గురించే ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. 26 లక్షల ఖతర్ జనాభాలో 6.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు.
నిర్ణయం వెనుక..
ఇరాన్ అండ ఉన్న గ్రూపులతోపాటు పలు ఉగ్ర ముఠాలకు ఖతర్ మద్దతిస్తోందని గల్ఫ్ దేశాలు కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నాయి. 2014లో ఖతర్ నుంచి తమ రాయబారులు వెనక్కి పిలిపించాయి. పొరుగు దేశాలు తమ వార్తా సంస్థను హ్యాక్ చేసి, తమపై దుష్ప్రచారానికి ఒడిగట్టాయని ఖతర్ ఇటీవల ఆరోపించింది. సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఖతర్ రాజు(అమీర్) షేక్ అల్ థానీ కొన్ని వ్యాఖ్యలు చేశారని ఇటీవల ఖతర్ న్యూస్ ఏజెన్సీలో వార్తలు వచ్చా యి.
ఇరాన్‌పై అమెరికా శత్రువైఖరిని ఆయన ప్రశ్నించారని, ట్రంప్ చాలా కాలం పదవిలో కొనసాగరని, ఖతర్– అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని ఆయన అన్నట్లు కథనాలొచ్చాయి. వీటిని ఖతర్ తోసిపుచ్చింది. తమ న్యూస్ ఏజెన్సీని హ్యాక్ చేశారని, తాము సైబర్ నేర బాధితులమని పేర్కొంది. ఉగ్రవాదంపై ముస్లిం దేశాలు కలసికట్టుగా పోరాడాలని ట్రంప్.. సౌదీ పర్యటనలో పిలుపునిచ్చిన నేపథ్యంలో కీలక అరబ్ దేశాలు ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్నాయి.