ఆకాశంలో కిలోమీటర్ ఎత్తున టవర్..!
కిలోమీటర్ ఎత్తున.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ప్రపంచంలోనే అతి పెద్ద, పొడవైన నిర్మాణాన్ని సౌదీ ప్రభుత్వం చేపట్టింది. ఈ భారీ కట్టడం నిర్మాణంలో 57 లక్షల చదరపు గజాల కాంక్రీట్, 80 వేల టన్నుల స్టీల్ ను వినియోగించి, దుబాయ్ లోని అతిపెద్ద టవర్, గిన్నిస్ రికార్డులకెక్కిన 'బుర్జ్ ఖలిఫా' ను తలదన్నే రీతిలో నిర్మిస్తున్న ఈ కట్టడం... అనుకున్నలక్ష్యాన్ని చేరితే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోగలదని భావిస్తున్నారు.
అతిపెద్ద జెద్ టవర్ ప్రాజెక్టు ఆకర్షణీయంగా నిర్మించేందుకు సుమారు ఏడువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. జెడ్ ఎకనమిక్ కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అలిన్మా ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు సంయుక్తంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను వెచ్చించి జెద్ నగరంలో ఈ నిర్మాణం చేపట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సౌదీ ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 26వ అంతస్తు వరకు పూర్తయిందని, 3 వేల 280 అడుగుల ఎత్తైన ఈ ఆకాశహర్మ్యం 2020 లోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఆధునిక జీవన శైలిని కూడా అందిస్తుందని, అనుకున్న లక్ష్యాన్ని చేరితే ఓ ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా ఈ ప్రాంతం రూపు దిద్దుకుంటుందని జెడ్దా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మౌనిబ్ హమ్మౌద్ అంటున్నారు.