రియాద్: పురుషులతో పోలిస్తే మహిళలకు 'పావుశాతం' మెదడు మాత్రమే ఉంటుందని, వాహనాలు నడిపేందుకు వారిని అనుమతించొద్దని సౌదీ అరేబియా మత పెద్ద ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో సౌదీ ప్రభుత్వం సదరు మతపెద్దపై వేటు వేసింది. ప్రార్థనలకు నేతృత్వం వహించడం సహా ఇతర మతకార్యక్రమాలేవీ చేపట్టకుండా ఆయనపై సస్పెన్షన్ విధించింది.
సాద్ హిజ్రీ అనే మతపెద్ద మాట్లాడుతూ.. పురుషులతో పోలిస్తే మహిళలకు 'సగం మెదడు' మాత్రమే ఉంటుందని, షాపింగ్ కు వెళ్లినప్పుడు అది పావుశాతానికి కుదించుకుపోతుందని, కాబట్టి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మతవాద దేశమైన సౌదీ అరేబియాలో మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మహిళలు వాహనాలు నడుపడం ఇక్కడ అనుమతించరు. అయితే , మహిళ ఉద్యోగితను పెంచేందుకు ఇటీవల సౌదీలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.