థామస్ పికెటీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్‌కు రోజులు బాగులేవు. ఈమధ్యే పారిస్‌ను అల్లకల్లోలం చేసిన ఉగ్రవాద దాడులు కంటిమీద కునుకులేకుండా చేస్తే అంతకన్నా ముందు కొత్త సంవత్సరం ప్రారంభం లో ప్రకటించిన దేశ అత్యున్నత పురస్కారం ప్రభుత్వాన్ని నగుబాటు పాలు చేసింది. ‘క్యాపిటల్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిరుడు వెలువరించిన గ్రంథం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలనుంచి, నిపుణుల నుంచి విశేష ప్రశంసలు పొందిన ఫ్రాన్స్ ఆర్థికవేత్త థామస్ పికెటీకి హొలాండ్ ప్రభుత్వం జనవరి 1న ‘లెజియన్ డి ఆనర్’ ప్రకటిం చింది. దాన్ని ఆయన నిరాకరిస్తారని ప్రభుత్వం ఊహించలేదు. సోషలిస్టు భావాలకు దగ్గరగా ఉండే థామస్ సోషలిస్టు ప్రభుత్వాన్ని ఇలా ఇరకా టంలో పెడతారని అనుకోలేదు. ‘లెజియన్ డి ఆనర్’ పౌర రంగంలో గానీ, సైనిక రంగంలోగానీ విశిష్ట సేవలు అందించినవారికిచ్చే అత్యుత్తమ పురస్కారం. మన ‘భారతరత్న’తో పోల్చదగ్గ ఆ అవార్డును 1802లో నెపోలియన్ నెలకొల్పాడు. దీన్నందుకోవడానికి ఏటా ఎందరెందరో అర్రులు చాస్తారు.
ఇంతకూ థామస్ రాసిన గ్రంథంలో ఏముంది? సమాజంలో ఆదా యం అందరికీ సమంగా ఎందుకుండదు...పెట్టుబడిదారీ విధానంలో కేవలం అత్యల్ప సంఖ్యాకులు మాత్రమే స్టాక్ మార్కెట్లలోనైనా, రియల్ ఎస్టేట్‌లోనైనా ఎందుకు ఆధిపత్య స్థానంలో ఉంటారు... మిగిలినవారం తా ఎందుకు విఫలమవుతారు...దాన్లోని కిటుకేమిటి అనే అంశాలను థామస్ చర్చించారు. సంపద పునఃపంపిణీ జరగాల్సిన ఆవశ్యకత గురిం చి వివరించారు. అది జరిగినప్పుడే కొందరికైనా పెట్టుబడి అందుబాటు లోకొచ్చి వారు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందని థామస్ సూత్రీకరించారు. థామస్ పుస్తకం బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో పదిలక్షల కాపీలు అమ్ముడయింది. ఇంతక్రితం అర్థశాస్త్రానికి చెందిన ఏ గ్రంథమూ ఈ స్థాయిలో అమ్ముడుకాలేదు. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కా రం పొందిన పాల్ క్రుగ్‌మాన్ అయితే థామస్ పుస్తకం ఈ దశాబ్దంలోనే ఎన్నదగినదని ప్రశంసించారు. అయితే, దీనిపై విమర్శలూ ఎక్కువే వచ్చాయి. ఈ పుస్తకం పట్టించుకోదగ్గది కాదన్నవారున్నారు. ఇందులో ఏమున్నదని పెదవి విరిచినవారున్నారు. థామస్‌కు అసలు పెట్టుబడి దారీ విధానం అర్థం కాలేదని, దాని సారాంశం ఆయన గ్రహించలేదని కొందరన్నారు. ప్రైవేటు పెట్టుబడి, స్వచ్ఛంద మార్పిడి, పోటీ మార్కెట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకపోగా అకౌంటింగ్ ఫార్ములాను ఉపయోగించి జాతీయాదాయంలో పెట్టుబడి వాటా ఎంతో తేల్చి దాని ద్వారా కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించేందుకు పూనుకున్నారని దుయ్య బట్టారు.
ఈ వాదవివాదాలకన్నా హొలాండ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డు తనకు సమ్మతం కాదని థామస్ చెప్పడం ఎక్కువ సంచలనం సృష్టించిం ది. దేశ పౌరుల్లో ఎవరు అత్యుత్తములో నిర్ణయించే అధికారం ప్రభుత్వా నికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఇలా ధిక్కార స్వరం వినిపించడం థామస్‌తోనే మొదలుకాలేదు. గతంలో ఫ్రెంచ్ తత్వవేత్త సార్త్, రేడియా లజీ ఆవిష్కర్తలు పియెరీ, మేరీ క్యూరీలు కూడా ఈ అవార్డును తోసిపు చ్చారు. మేధావి పాత్ర రాజ్యాన్ని విమర్శనాత్మకంగా చూడటం, ప్రజల అంతరాత్మను మేల్కొల్పడం తప్ప ప్రభుత్వాల గుర్తింపు కోసం వెంపర్లా డటం కాదని థామస్ భావన. ఫ్రాన్స్ ప్రభుత్వం ఇవ్వజూపిన పురస్కా రాన్ని నిరాకరించడం ద్వారా ఆయన దీన్ని మరోసారి చర్చకు తీసుకొ చ్చారు. దేశదేశాల్లోని మేధావులకూ, కళాకారులకూ దిశానిర్దేశం చేశారు.