
అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తమ విద్యార్థులు నిరసనలు, పౌర కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంవత్సరానికి ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ పాఠశాల వర్జీనియాలోని అతి పెద్దదిగా పేరు గాంచింది. ఈ కొత్త విధానాన్ని ఫెయిర్‌ఫాక్స్ స్కూల్ బోర్డ్ సభ్యుడు ర్యాన్ మెక్‌ఎల్వీన్ ప్రవేశపెట్టినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. మెక్ ఎల్వీన్ స్పందిస్తూ.. నిరసనలకు ఒకరోజు సెలవు ఇవ్వడం యుఎస్‌లోనే మొదటిసారి అని తెలిపారు. ఈ నిర్ణయంతో యూఎస్‌లోని మిగతా పాఠశాలలకు ప్రేరణ కలగవచ్చని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు క్రియాశీలతతో వ్యవహరిస్తున్నారని అన్నారు.
విద్యార్థులు సెలవు తీసుకోవడానికి తల్లిదండ్రులు, సంరక్షకులు అనుమతి ఇవ్వాలని అన్నారు. సెలవు తీసుకున్న కారణాన్ని వివరించడానికి విద్యార్థులు ఒక ఫారమ్‌ను నింపాలని మెక్ఎల్వీన్ తెలిపారు. విద్యార్థులకు అక్రిడేషన్ సమస్య ఉంటే సెలవు రోజులలో కూడా రావాలని జిల్లా మహిళా ప్రతినిధి లూసీ కాల్డ్వెల్ పేర్కొన్నారు. కాగా నిరసనల కోసం పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఉదారవాద కారణాలకు అనుకూలంగా ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నియమాలను రాతపూర్వకంగా ఉంచుతామని కాల్డ్‌వెల్ తెలిపారు. మన భవిష్యత్తుకు భరోసా లేనప్పుడు పాఠశాలకు వెళ్లినా లాభం లేదని కాల్డ్‌వెల్ తెలిపారు. కాగా కొత్త విధానం ద్వారా వాతావరణ సమస్యల పరిష్కారం కోసం హాజరయ్యే విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందని తెలిపారు. ఏడు నుంచి 12 వ తరగతి చదివే విద్యార్థులు మార్చ్‌లకు హాజరు కావడం, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించడం, పౌర కార్యకలాపాల కోసం సెలవును ఉపయోగించుకోవచ్చని లూసీ కాల్డ్వెల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment