పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు!
లండన్: పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణమైన కార్బన్ డైఆక్సైడ్ వాయువును తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న ప్రయోగాల్లో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బృందం నిర్వహించిన ప్రయోగాల్లో ఈ గ్రీన్హౌస్ కారక వాయువు బసాల్ట్ రకపు శిలలతో వేగంగా చర్యజరుపుతోందని కనుగొన్నారు. దీంతో పర్యావరణానికి హాని చేయని ఖనిజాలు ఏర్పడుతాయని ఈ ప్రయోగానికి సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు.
పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించడానికి గతంలో శాస్త్రవేత్తలు నిరుపయోగంగా ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్ రిజర్వాయర్లలో సీల్ చేయాలని భావించారు. అయితే దీనిలో లీకేజీ సమస్య ఉండటంతో ఈ దిశగా ముందడుగు పడలేదు. దీంతో కార్బన్ డైఆక్సైడ్ను మినరలైజ్ చేసే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇప్పటి వరకూ కార్బన్ ఖనిజాలుగా రూపాంతరం చెందడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని భావించారు.
అయితే శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా ప్రయోగంలో బసాల్ట్ రకపు శిలలతో కార్బన్ డైఆక్సైడ్ వేగంగా చర్య జరుపుతుందని, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఖనిజంగా రూపాంతరం(మినరలైజ్) చెందుతుంది అని గుర్తించారు. ఈ రకమైన శిలలు భూమిపై విరివిగా అందుబాటులో ఉన్నాయని.. పర్యావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించడానికి ఈ ఫలితాలు దోహదం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్త జ్యూర్గ్ మేటర్ తెలిపారు.