
పరిశ్రమల గొట్టాల నుంచి వెలువడే పొగలోని కార్బన్ డైయాక్సైడ్‌ను మరింత సమర్థంగా తొలగించేందుకు ఒరెగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నిక్‌ను కనుక్కున్నారు. భూతాపోన్నతిని తగ్గించడంలో ఈ టెక్నిక్ కీలక పాత్ర పోషించగలదని అంచనా. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి గాల్లో కార్బన్‌డై యాక్సైడ్ మోతాదు సుమారు 40 శాతం వరకూ పెరిగిపోగా దీని ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు 0.84 డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువైంది. ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్‌డైయాక్సైడ్ మోతాదు ప్రతి పదిలక్షల కణాలకు 407.4గా ఉంది. భూమిపై గత ఎనిమిది లక్షల ఏళ్లలో ఇంత స్థాయి కాలుష్య వాయువు ఎప్పుడూ లేకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో పరిశ్రమల పొగగొట్టాల నుంచి కార్బన్‌డై యాక్సైడ్‌ను తగ్గించేందుకు ఏం చేయాలన్న విషయంపై ఒరెగాన్‌తోపాటు అనేక ఇతర వర్సిటీలు సంయుక్తంగా పరిశోధనలు ప్రారంభించాయి. వందల, వేల నానో పదార్థాల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్) ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని నిర్ధారించుకున్నారు. ఈ ఎంఓఎఫ్‌ల్లో రెండిని పరీక్షించినప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక పదార్థాల కంటే ఇవి 13 రెట్లు ఎక్కువ మెరుగ్గా పనిచేసినట్లు తెలిసింది. మరింత విస్తృత స్థాయి పరిశోధనలు చేయడం ద్వారా ఈ ఎంఓఎఫ్‌లను మెరుగుపరచవచ్చునని, పరిశ్రమల్లో వీటిని వాడటం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment