వేగంగా వేడెక్కుతున్న సముద్రాలు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు వేగంగా వేడెక్కుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. 1865 నుంచి ఇప్పటివరకూ సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదలను పరిశీలిస్తే గత రెండు దశాబ్దాల్లోనే సగం పెరుగుదల నమోదైందని వెల్లడైంది. సముద్రాలు గణనీయంగా వేడెక్కుతుండడం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోందని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు పీటర్ గ్లెక్లర్ తెలిపారు.
పెరుగుతున్న భూతాపంలో దాదాపు 90 శాతం సముద్రాలే నిక్షిప్తం చేసుకుంటాయని ఆయన చెప్పారు. నిరంతరంగా కర్బన ఉద్గారాలు పెరుగుతుండడమే సముద్ర, వాతావరణ ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని తెలిపారు. ఈ అధ్యయన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.